Jaisankar On Illegal Immigrants :అక్రమ వలసదారులను స్వదేశాలకు తిప్పి పంపడం కొత్తేమీ కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. బుధవారం 104 మంది భారతీయులను అమెరికా స్వదేశానికి తిప్పి పంపిన నేపథ్యంలో రాజ్యసభలో గురువారం ప్రకటన చేశారు విదేశాంగ మంత్రి.
అక్రమ వలసలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని జైశంకర్ తెలిపారు. వలసల సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపించేస్తోందన్నారు. ఇతర దేశాల్లో తమ పౌరులు చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు తీసుకెళ్లిపోవడం అన్ని దేశాల ప్రభుత్వాల బాధ్యత అని వివరించారు. అక్రమ వలసదారుల తరలింపును అమెరికా కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అథారిటీ- ICE అమలు చేసిందని వెల్లడించారు. తరలిస్తున్న వలసదారుల పట్ల ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా చూసేందుకు అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
"చట్టపరమైన వలసలను ప్రోత్సహించడం, అక్రమ వలసలను కట్టడి చేయడం భారత్, అమెరికా సమష్టి నిర్ణయం. నిజానికి అక్రమ వలసలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దారి తీస్తాయి. అలాంటి పౌరులను చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లోకి దించే అవకాశముంది. తమకు తామే నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. వారిని ట్రాప్ చేసి అమానవీయ పద్ధతుల్లో రవాణా చేయడం, పనిచేయించడం వంటి అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న తమ పౌరులను తీసుకెళ్లడం అన్ని దేశాల బాధ్యత. అక్రమ వలసలను కట్టడిపై మా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. చట్టబద్ధమైన ప్రయాణం కోసం వీసాలను సులభతరం చేయడానికి మేం చర్యలు తీసుకుంటున్నాం. తిరిగి వచ్చిన వలసదారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బాధ్యులైన ఏజెంట్లు, ఇతరులపై లాఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కఠినమైన చర్యలు తీసుకుంటాయి."
-- ఎస్ జై శంకర్, భారత విదేశాంగ మంత్రి
తొలి విడతలో భాగంగా బుధవారం అమెరికా నుంచి 104 మంది వలసదారులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిని పోలీసులు తనిఖీ చేసి, వివరాలను పరిశీలించాక ఇళ్లకు పంపారు. అమెరికా హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు అధికారులు గుర్తించారు. 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రానున్న రోజుల్లో అమెరికా నుంచి అనేక మంది స్వదేశానికి చేరుకోనున్నారు.