Nijjar Documentary On Canada :ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. నిజ్జర్ హత్యపై ఆ దేశ మీడియా సంస్థ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం, డాక్యుమెంటరీపై నిషేధం విధించింది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో కెనడా మీడియా వ్యవహరించిన తీరు వీటిని మరోసారి పెంచింది.
కెనడా ప్రభుత్వం అండతో నడిచే సీబీసీ అనే వార్తా సంస్థ 'ది ఫిఫ్త్ ఎస్టేట్' పేరుతో ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రామ్‌ను చేస్తోంది. ఇటీవలే ఇందులోని ఓ ఎపిసోడ్‌లో నిజ్జర్ హత్యపై డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 'కాంట్రాక్ట్ టు కిల్' పేరుతో తీసిన 45 నిమిషాల వీడియోలో ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా ఉన్నాయి. దీంతో ఇది కాస్త మరోసారి వివాదానికి దారితీసింది. అయితే, ఈ డాక్యుమెంటరీ ఏకపక్షంగా ఉందని, కొందరు ఇండో-కెనడియన్ కమ్యూనిటీ సభ్యులు ఆరోపించారు.
భారత్‌లో డాక్యుమెంటరీ బ్యాన్
మరోవైపు ఈ డాక్యుమెంటరీపై కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ వీడియోపై నిషేధం విధించింది కేంద్రం. దీన్ని భారత్‌లో ప్రసారం చేయొద్దని యూట్యూబ్, ఎక్స్ వంటి మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నిర్ణయంతో ఈ డాక్యుమెంటరీని భారత యూజర్లు చూడకుండా ఆ మాధ్యమాలు యాక్సెస్‌ను పరిమితం చేశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా మిగతాచోట్ల ఇది ప్రసారం అవుతుంది.