NCP Factions Reunion :మహారాష్ట్రలో రెండుగా చీలిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ కలవనుందనే ప్రచారం జోరందుకుంది. డిసెంబర్ 12న శరద్ పవార్ పుట్టినరోజు సందర్భంగా అజిత్ పవార్ దిల్లీలోని తన బాబాయి నివాసానికి వెళ్లారు. అప్పటి నుంచి వారి మధ్య సయోధ్య కుదిరిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో అజిత్ పవార్ తల్లి ఆశాతై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పండరీపుర్ ఆలయాన్ని దర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె పవార్ కుటుంబంలోని విభేదాలు సమసిపోయి తన కుమారుడు, శరద్ పవార్‌తో కలవాలని దేవున్ని మొక్కినట్లు తెలిపారు. తన కోరిక తీరుతుందని ఆశాతై ఆశాభావం వ్యక్తం చేశారు.
అజిత్ పవార్ తల్లి వ్యాఖ్యలపై స్పందించిన ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ నుంచి విడిపోయినప్పటికీ శరద్ పవార్‌పై తమకు అమితమైన గౌరవం ఉందన్నారు. ఆయన తండ్రితో సమానమని, పవార్ కుటుంబం మళ్లీ కలవాలని కోరుకుంటున్నట్లు ప్రఫుల్ పటేల్ అన్నారు. వారి వ్యాఖ్యలతో బాబాయి-అబ్బాయి మళ్లీ కలుస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
రెండుగా చీలిన ఎన్సీపీ
2023లో నాటకీయ పరిణామాలకు ఎన్సీపీ వేదికైంది. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శరద్ పవార్ మే నెలలో ప్రకటించారు. కొత్త తరానికి పార్టీని అప్పగిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్షుడిని ఎన్సీపీ సభ్యులు ఎన్నుకోవాలని సూచించారు. అయితే పార్టీ నేతలు, కార్యకర్తల నిరసనల నేపథ్యంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ పరిణామాలు జరిగిన రెండు నెలలకు 2023 జులైలో అజిత్ పవార్ పార్టీని చీల్చారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి జులైలో బీజేపీ-శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు. పార్టీ పేరు, గుర్తును తమ వర్గానికే కేటాయించాలని ఈసీని కోరారు.
ఎన్నికల సంఘం పరిష్కారం!
అనంతరం ఎన్సీపీలో వర్గపోరును కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఈసీ తేల్చింది. ఆరు నెలల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది. శాసనసభలో మెజారిటీ నిరూపించుకున్న నేపథ్యంలో ఎన్సీపీ గుర్తు అయిన 'గడియారం' అజిత్ వర్గానికే చెందుతుందని ఈసీ స్పష్టం చేసింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం తమ పార్టీకి కొత్త పేరు పెట్టుకునే వీలు కల్పిస్తున్నట్లు ఈసీ పేర్కొంది.