Mukhtar Ansari Funeral Rites : గుండెపోటుతో మరణించిన గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్‌లో పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య కాలీ బాగ్‌లోని శ్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ప్రత్యేకమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అయితే ఈ అంతక్రియలకు అన్సారీ భార్య అఫ్షాన్ అన్సారీ, కుమారుడు అబ్బాస్ హాజరుకాలేదు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు, స్మశానవాటికలోకి ప్రవేశించేందుకు బారికేడ్లను బద్దలు కొట్టడం వల్ల గందరగోళం నెలకొంది.
రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్
యూపీలోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్న 63 ఏళ్ల అన్సారీ గురువారం రాత్రి 8.25 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో జైలు అధికారులు ఆయనను దుర్గావతి మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పోస్ట్‌మార్టమ్ పరీక్షలు నిర్వహించి కుటుంబసభ్యులకు అందించారు. మరవైపు రాష్ట్రంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ను విధించారు. ప్రజలు ఎక్కడా గుమికూడదని ప్రకటించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించారు. అన్సారీ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసుల ఐటీ సెల్ గట్టి నిఘా పెట్టింది.
ముఖ్తార్‌కు స్లో పాయిజన్
అయితే అన్సారీ మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు ఉమర్ అన్సారీ మాత్రం తన తండ్రికి 'స్లో పాయిజన్' ఇచ్చారని ఆరోపిస్తున్నారు. రెండురోజుల క్రితం తాను ఆయన్ను కలవడానికి వెళ్లినప్పుడు అనుమతించలేదని ఉమర్ చెప్పారు. అంతకుముందు ముఖ్తార్ సోదురుడైన గాజీపుర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ సైతం ఇదే తరహాలో చెప్పారు.