Migrant Worker Found Living In Kennel : ఓ వలస కార్మికుడు గత కొన్ని నెలలుగా కుక్కల గదిలో నివసిస్తున్న ఘటన కేరళలో చర్చనీయాంశమైంది. ఈ విషయం కేరళ కార్మిక శాఖ మంత్రి వి శివన్ కుట్టి దృష్టికి వెళ్లగా, ఆయన విచారణకు ఆదేశించారు. మున్సిపల్ అధికారులు, పోలీసుల సూచనల మేరకు కుక్కల నివాసం ఉండే ఆ గదికి తాళం వేశారు. సదరు కార్మికుడిని అతడి సంబంధీకుల ఇంట్లోకి మార్చారు. అయితే ఆ కార్మికుడు కుక్కల గదిలో ఎందుకు ఉన్నాడంటే?
ఇదీ జరిగింది
బంగాల్లోని ముర్శిదాబాద్ జిల్లాకు చెందిన శ్యామ్ సుందర్(37) పని కోసం నాలుగేళ్ల క్రితం కేరళకు వచ్చాడు. వివిధ ప్రాంతాల్లో పని చేసి, మూడు నెలల క్రితం ఎర్నాకులంలోని పరవం వచ్చాడు. అయితే ఈ ప్రదేశంలో శ్యామ్‌కు గది అద్దెకు దొరకలేదు. అద్దె కూడా ఎక్కువగా ఉండటం వల్ల, తనతో పని చేసే వారి సహాయంతో ఖాళీగా ఉన్న డాగ్ కెన్నెల్‌ను కనుగొన్నాడు. తన తోటి వలస కార్మికులు ఉన్న గది పక్కనే ఆ కుక్కల గది ఉంది. దానికి నెలకు రూ.500 అద్దె చెల్లిస్తూ గత మూడు నెలలుగా అందులోనే ఉంటున్నాడు. ఆ కుక్కల గది గ్రిల్స్‌ను కార్డుబోర్డు షీట్లతో కప్పి అందులోనే వంట చేసుకుని తింటున్నాడు.
అయితే ఓ వ్యక్తి కుక్కల గదిలో ఉంటున్నాడని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు శ్యామ్ సుందర్‌ను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో శ్యామ్ సుందర్‌కు సమస్యలేవీ నిర్ధరణ కాలేదు. అనంతరం ఉన్నతాధికారులు, పోలీసుల సూచన మేరకు ఆ కుక్కల గదికి తాళం వేశారు.