తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే పేరుతో చాలా ఊళ్లు- అడ్రస్ చెప్పలేక ఇబ్బందులు- 15ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు!

15 ఏళ్ల క్రితం కుటుంబానికి దూరమైన మహిళ- ఎట్టకేలకు కలుసుకున్న తల్లీకొడుకులు- తీవ్ర భావోద్వేగం

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Women meet Children After 15 Years
Women meet Children After 15 Years (ETV Bharat)

Women Met Children After 15 Years: 15 ఏళ్ల క్రితం అయినవారికి దూరమైన ఓ మహిళ, ఎట్టకేలకు కుటుంబ సభ్యుల్ని కలుసుకుంది. మతిస్థిమితం బాగాలేక కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయిన ఆమె తాజాగా కొడుకును కలిసింది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది.

అసలేం జరిగిందంటే?
మద్దూరుకు చెందిన ఫర్జానా ఆనే మహిళ 2009లో కుటుంబానికి దూరమైంది. మానసిక ఆరోగ్యం బాగాలేక ఇంటి నుంచి వెళ్లిపోయింది. మంగళూరులోని హోయిగే బజార్​లో ఫర్జానా నిరాశ్రయురాలిగా తిరగడాన్ని చూసిన వైట్ డౌస్ సేవా సంస్థకు చెందిన కొరినా రస్కిన్ ఆమెను రక్షించి, చికిత్స చేయించారు. అలాగే ఆశ్రయం కల్పించారు. అయితే ఆమె ఫర్జానాకు అడ్రస్, కుటుంబ సభ్యుల గురించి సరిగ్గా చెప్పలేకపోయింది.

అడ్రస్ కోసం కష్టాలు
మద్దూరులోని మాంసం దుకాణం వద్ద తన ఇల్లు ఉందని ఫర్జానా చెబుతుండేది. అయితే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మద్దూరు పేరుతో పట్టణాలు ఉన్నాయి. దీంతో ఫర్జానా అడ్రస్ సరిగ్గా తెలియలేదు. ఈ నేపథ్యంలో వైట్ డౌవ్స్ సంస్థ తన సిబ్బందిని రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పంపించి ఫర్జానా కుటుంబసభ్యుల ఆచూకీ కోసం వెతికినా లభించలేదు.

అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యుల ఆచూకీ!
ఇటీవల మద్దూరుకు చెందిన ఓ మానసిక రోగిని తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబ సభ్యులు వైట్ డౌస్ సేవా సంస్థ వద్దకు వచ్చారు. వారికి మద్దూరులోని మాంసం వ్యాపారులకు ఫర్జానా గురించి తెలియజేయాలని వైట్ డౌస్ సేవా సంస్థ సభ్యులు ఒక స్లిప్​ను ఇచ్చారు. అయితే అదృష్టవశాత్తూ ఫర్జానా కుమారుడు ఆసిఫ్​కు స్లిప్ అందింది. వెంటనే తన తల్లి ఆచూకీ తెలియడం వల్ల ఆసిఫ్ సంతోషపడ్డాడు. తన భార్యాపిల్లలు, సోదరి, బావతో కలిసి మంగళూరులోని వైట్ డౌస్ కు వచ్చాడు.

కొడుకును గుర్తు పట్టిన తల్లి!
తనను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన కొడుకు, కుమార్తె, అల్లుడు, మనవరాళ్లను చూసి ఫర్జానా ఆనందానికి అవధుల్లేవు. అయితే తన కొడుకు అసిఫ్​ను మాత్రమే ఫర్జానా గుర్తుపట్టింది. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయేసరికి అసిఫ్ వయసు మూడేళ్లే. "గత కొన్నేళ్లుగా వెతుకుతున్నా మా అమ్మ అచూకీ తెలియలేదు. ఈ రోజు మా అమ్మని చూడడం చాలా సంతోషంగా ఉంది. నాకు మా అమ్మ గుర్తుంది. కానీ మా చెల్లి మాత్రం మా అమ్మను గుర్తుపట్టలేదు " అని అసిఫ్ ఈటీవీ భారత్​కు తెలిపాడు.

గత 15ఏళ్లుగా ఆశ్రయం
2009 ఆగస్టులో ఫర్జానాను తాను రక్షించి, ఆశ్రయం కల్పించామని వైట్‌ డౌస్‌ సంస్థ వ్యవస్థాపకురాలు కొరినా రాస్కిన్‌ తెలిపారు. అప్పుడు ఆమె తన అడ్రస్​ను చెప్పలేకపోయారని పేర్కొన్నారు. తాజాగా తన కుటుంబ సభ్యులతో ఫర్జానా ఇంటికి వెళ్లారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details