Modi On Opposition Parties : బంగాల్‌లో భారతీయ జనతా పార్టీ 2019ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ స్థానాలు గెలుపొందనుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టీఎంసీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ గెలుపును ఆపలేదన్నారు. లోక్‌సభ ఎన్నికలప్రచారంలో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లా బారక్‌పుర్, హూగ్లీ, ఆరంబాగ్ తదితర బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, టీఎంసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిందని, ఆ పార్టీకి ఈసారి రాహుల్‌గాంధీ వయసు కంటే తక్కువ సీట్లు రాబోతున్నాయని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. సందేశ్‌ఖాలీ మహిళలపై టీఎంసీ గూండాల నిర్వాకాలను దేశమంతా చూసిందన్నారు. పోలీసులు మొదట నిందితులను కాపాడే ప్రయత్నం చేయగా ఇప్పుడు టీఎంసీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు. టీఎంసీ పాలనలో బెంగాల్ అవినీతి కుంభకోణాలకు అడ్డాగా బాంబుల తయారీకి కుటీర పరిశ్రమగా మారిందన్నారు. దీదీ ప్రభుత్వం కుంభకోణాలు చేయటమే పనిగా పెట్టుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు.
"బంగాల్‌లోని బారక్‌పుర్ చరిత్ర లిఖించిన గడ్డ. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖపాత్ర పోషించింది. కానీ టీఎంసీ హయాంలో పరిస్థితి పూర్తిగా మారింది. ఒక సమయంలో బంగ్లాదేశ్ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయటంలో కీలకపాత్ర పోషించేది. ఇప్పుడు టీఎంసీ...కుంభకోణాలకు అడ్డాగా మార్చింది. ఒక సమయంలో బంగాల్‌లో ఒకదాని మించి ఒక శాస్త్రీయ ఆవిష్కరణలు జరిగేవి. టీఎంసీ పాలనలో బాంబుల తయారీ కుటీరపరిశ్రమగా మారింది. ఒక సమయంలో చొరబాట్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగేది. కానీ టీఎంసీ సంరక్షణలో చొరబాట్లు పెరిగిపోయాయి."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి