తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహాకుంభమేళా ఐక్యతకు గుర్తు- భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: ప్రధాని మోదీ - MODI LINKS MAHA KUMBH WITH UNITY

మన దేశంలో హిందూ మతాన్ని పరిహాసం చేసే నాయకుల వర్గం ఉంది- బానిస మనస్తత్వం ఉన్నవారు హిందూ విశ్వాసాలపై దాడి చేస్తున్నారు: నరేంద్ర మోదీ

modi
modi (ANI)

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2025, 4:55 PM IST

Updated : Feb 23, 2025, 7:31 PM IST

Modi Links Maha Kumbh With Unity :మహాకుంభమేళాపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'బానిస మనస్తత్వం' కలిగినవారు విదేశీ శక్తుల మద్దతుతో, భారతదేశ మత, సాంస్కృతిక సంప్రదాయాలపై దాడి చేస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్పూర్‌లో బాగేశ్వర్‌ ధామ్‌ మెడికల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఐక్యతకు గుర్తుగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే కోట్లాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి సంత్‌ల ఆశీస్సులు తీసుకున్నారని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని ప్రధాని పేర్కొన్నారు.

"ఈ రోజులల్లో మన మతాన్ని ఎగతాళి చేసే, అపహాస్యం చేసే నాయకుల గుంపు ఒకటి ఉంది. వారు మన ఐక్యతను విచ్ఛిన్నం చేసే, ప్రజలను విభజించే పనిలో నిమగ్నమైయున్నారు. విదేశీ శక్తులు కూడా ఇలాంటి వ్యక్తులకు మద్దతు ఇస్తూ, మన దేశాన్ని, మతాన్ని బలహీన పరచడానికి ప్రయత్నిస్తున్నాయి."
- ప్రధాని మోదీ

మమతకు గట్టి కౌంటర్‌
బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట గురించి మాట్లాడుతూ మహాకుంభ్‌ను మృత్యుకుంభ్‌గా అభివర్ణించారు. దీనితో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే మోదీ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. "హిందూ విశ్వాసాలను ద్వేషించేవారు శతాబ్దాలుగా వివిధ వేషాల్లో జీవిస్తున్నారని" మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'బానిస మనస్తత్వం ఉన్న ఈ వ్యక్తులు మన నమ్మకాలు, దేవాలయాలు, సాధువులు, సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తున్నారు. ఈ వ్యక్తులు మన పండుగలు, సంప్రదాయాలను, నమ్మకాలను విమర్శిస్తున్నారు. ఈ వర్గం మన సమాజాన్ని, ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే ఎజెండాగా పనిచేస్తోంది' అని మోదీ అన్నారు.

144 సంవత్సరాల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్‌ ప్రాముఖ్యాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. దీనిని విజయవంతం చేయడంలో సఫాయి కార్మికులు, పోలీస్‌, వైద్య సిబ్బంది గొప్పగా పనిచేశారని ఆయన ప్రశంసించారు. యుగయుగాలుగా హిందూ మఠాలు, ధామాలు, దేవాలయాలు ఆరాధన, విశ్వాస కేంద్రాలుగా, సైన్స్‌, పరిశోధనలకు ఆలవాలంగా పనిచేస్తున్నాయని మోదీ అన్నారు. 'హిందూ సాధువులు యోగా, సైన్స్ జ్ఞానాన్ని అందించారు. నేడు ప్రపంచం యోగాను అనుసరిస్తోంది. యోగా మన దేశాన్ని గర్వపడేలా చేసింది. మన జెండాను ఎగురవేసింది' అని మోదీ అన్నారు.

సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌
ప్రధానిగా తాను ఎల్లప్పుడూ 'సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌' అనే సూత్రంలో పనిచేస్తానని, ఇప్పుడు 'సబ్‌కా ఇలాజ్, సబ్‌కా ఆరోగ్య' అనే ప్రతిజ్ఞను కూడా జోడించానని మోదీ అన్నారు. రానున్న మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డేకేర్‌ కేంద్రాలను ప్రారంభిస్తామని మోదీ అన్నారు.

Last Updated : Feb 23, 2025, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details