తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మెట్టినింటిలో అత్యాచారం జరిగితే FIR నమోదు చేయాల్సిందే'- సుప్రీంకోర్టులో లాయర్ కొలిన్‌ వాదన! - SUPREME COURT ON MARITAL RAPE

భార్యపై అత్యాచారాన్ని నేరంగా పరిగణించకుండా ఇస్తున్న మినహాయింపులను కొట్టివేయాలంటూ పిటిషన్లు- సుప్రీంలో విచారణ

Supreme Court On Marital Rape
Supreme Court On Marital Rape (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 7:01 AM IST

Supreme Court On Marital Rape : 'వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తిస్తే వివాహ వ్యవస్థ అస్థిరతకు గురవుతుందా?' అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 18 ఏళ్లు దాటిన భార్యపై అత్యాచారాన్ని నేరంగా పరిగణించకుండా, ఐపీసీ, బీఎన్‌ఎస్‌లో భర్తకు ఇస్తున్న మినహాయింపులను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా వైవాహిక అత్యాచారానికి శిక్షలు విధిస్తే, వివాహ బంధం ప్రభావితమవుతుందంటూ కేంద్రం దాఖలు చేసిన ప్రమాణపత్రంపై పిటిషనర్ల అభిప్రాయాలను ధర్మాసనం కోరింది.

వైవాహిక అత్యాచారానికి మినహాయింపునిచ్చే ఐపీసీ, బీఎన్‌ఎస్‌లోని నిబంధనలు రద్దు చేయాలని సీనియర్‌ న్యాయవాది కరుణా నంది వాదించారు. "మీరేమో అధికరణం 14 (సమానత్వ హక్కు), అధికరణం 19, అధికరణం 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ)కు భంగం కలుగుతుందని చెబుతున్నారు. పార్లమెంటేమో ఈ మినహాయింపిచ్చినప్పుడు 18 ఏళ్ల దాటిన భార్యతో శృంగారం అత్యాచారం కిందకు రాదని భావించింది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భర్తకు రక్షణ కల్పించే నిబంధనను వ్యతిరేకిస్తూ రాజ్యాంగంలో పితృస్వామ్యానికి, స్త్రీ ద్వేషానికి తావు లేదని న్యాయవాది నంది తెలిపారు. మరో సీనియర్‌ న్యాయవాది కొలిన్‌ గొంజాల్వెస్‌ "మహిళ వద్దు అంటే వద్దు. మెట్టినింటిలో అత్యాచారం జరిగితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే" అని అన్నారు. తదుపరి విచారణను ఈ నెల 22కు ధర్మాసనం వాయిదా వేసింది.

కేవలం అనుమానంతో శిక్షించలేం!
మరోవైపు, కుమార్తెతో సహా కుటుంబ సభ్యులను హత్య చేశాడనే ఆరోపణలతో మరణ దండన ఎదుర్కొంటున్న ఖైదీని సుప్రీంకోర్టు సంశయ లబ్ధి కింద నిర్దోషిగా ప్రకటించింది. కేవలం అనుమానంతో నిందితుడికి శిక్ష విధించడం తగదని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. పొరుగింటి వారి ప్రాసంగిక సాక్ష్యాల ఆధారంగా నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ట్రయల్‌ కోర్టు, బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పును కొట్టివేసింది. అనుమానం ఎంత బలంగా ఉన్నప్పటికీ నిస్సందేహమైన సాక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. నేరం కచ్చితంగా నిరూపితమయ్యే వరకు నిందితుడిని నిరపరాధిగానే పరిగణించాలని తెలిపింది.

పొరుగింటి వారు ఆపాదించిన ఉద్దేశాలను తిరస్కరించింది. సాక్షులు నేర ఘటనను ప్రత్యక్షంగా చూడలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన విశ్వజీత్‌ మసాల్కర్‌ మరో మహిళను వివాహం చేసుకోవాలన్న తన అభీష్టాన్ని తిరస్కరించారనే కోపంతో కుటుంబ సభ్యులను హత్య చేశాడని సాక్షులు పేర్కొన్నారు. భార్యకు విడాకులివ్వాలని నిర్ణయించుకున్నాడనీ తెలిపారు. అయితే, 2012 అక్టోబరు 4న ఇంట్లో చోరీ జరిగిందని, తన తల్లి, భార్య, కుమార్తెను హత్య చేశారని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు విశ్వజీత్‌ మసాల్కర్‌ ఫోన్‌ చేసి తెలిపాడు. నగదు, ఆభరణాలు కూడా చోరీకి గురయ్యాయని పేర్కొన్నాడు. ఈ నేరాలు మసాల్కరే చేశాడని అనుమానిస్తూ అతనిని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details