Tips in Telugu to Save Electricity Bill : వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులతో వేసవికి ముందే ప్రజలు వేడికి భరించలేకపోతున్నారు. వేసవి తాపం నుంచి రక్షించుకోవడానికి ఏసీలు, కూలర్లు వాడుతుండటంతో ఫిబ్రవరి మొదటి వారంలోనే విద్యుత్తు వినియోగం పెరిగిపోతోంది. విచ్చలవిడిగా వాడితే గృహజ్యోతి పథకం వర్తించకుండా పోయే ప్రమాదముంది. 200 యూనిట్లపై ఒక్క యూనిట్ అదనంగా వచ్చినా బిల్లు కట్టాల్సిందే. ఒకవైపు వేసవి తాపం మరోవైపు విద్యుత్ బిల్లుల భారం ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి గట్టెక్కాలంటే విద్యుత్తును పొదుపుగా వాడుకోవడం ఒక్కటే మార్గం. అలా అని ఉపకరణాలను పూర్తిగా కట్టేయాల్సిన పని లేకుండా విద్యుత్ పొదుపుగా వాడుకుంటే సరిపోతుంది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లో నిరంతరాయంగా గృహజ్యోతి వెలుగులు :
- ప్రస్తుతం దాదాపు అన్ని ఇళ్లలో ఎల్‌ఈడీ బల్బులు వినియోగిస్తున్నారు. ఇప్పటికీ కొందరు పాతకాలం ఫ్లోరోసెంట్ ట్యూబ్‌లైట్లే వాడుతున్నారు. వీటి సామర్థ్యం 40 వాట్స్ ఉండడంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశముంది. దీని దృష్ట్యా ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు మేలు.
- ఏసీలు 24 నుంచి 29 డిగ్రీల మధ్య ఉపయోగిస్తేనే చల్లదనంతో పాటు బిల్లు ఆదా అవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇన్‌వర్టర్‌తో కూడిన ఏసీలు అందుబాటులో ఉన్నాయి. గది చల్లబడగానే ఆటోమెటిక్‌గా ఏసీ ఆగిపోతుంది. వీటితో కొంత విద్యుత్తు వినియోగం తగ్గే అవకాశముంది. సాధారణ ఏసీలు కరెంటు పోయి వచ్చినప్పుడు పునఃప్రారంభమయ్యే సమయంలో లోడ్ పెరిగిపోతుంది. ఇది విద్యుత్తు సరఫరా వ్యవస్థపై భారం పడుతుంది.
- వేసవికి ముందే ఏసీలను మెకానిక్‌తో తనిఖీ చేయించాలి. ఫిల్టర్లు శుభ్రం చేయించడంతోపాటు గాలి ఫ్లోటింగ్‌ను పరిశీలించాలి.
- సీజన్ మేరకు ఫ్రిజ్‌లో ఫ్రీజర్ దశలు మారుస్తూ ఉండాలి. వేసవిలో ఎక్కువ ఉంచినా మిగిలిన కాలాల్లో తగ్గించుకోవాలి. మంచు పొరలు పావు వంతు పెరిగినట్లు గమనిస్తే వెంటనే డీప్రాస్ట్ అనే ఆప్షన్‌తో తొలగించాలి.
- ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఎల్‌ఈడీ బల్బులు, రిఫ్రిజిరేటర్లు తదితర విద్యుత్తు గృహోపకరణాలు బీఈఈ రేటింగ్ 1 నుంచి 5 స్టార్లతో విక్రయిస్తున్నారు. వీటిలో 5 స్టార్ ఉంటే విద్యుత్ వినియోగం తగ్గి బిల్లు ఆదా అవుతుంది.
- అవసరం లేని సమయంలో కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు స్విచ్ఛాఫ్ చేయాలి. ఫోన్ ఛార్జింగ్ పూర్తయ్యాక ఛార్జర్‌ను ప్లగ్ నుంచి తొలగించాలి.
ఏంటీ ఇది నిజమేనా? - ఒక్క బోరు మోటారు బిల్లే అక్షరాలా రూ.8 లక్షలు!