No Rice Distribution for New Ration Card Holders : రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినా.. కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులకు ఇంకా రేషన్ అందలేదు. కామారెడ్డి జిల్లా జిల్లా వ్యాప్తంగా గత నెల 26వ తేదీన ఎంపిక చేసిన 25 గ్రామాల్లో 422 మందికి కొత్త రేషన్‌కార్డులు అందజేశారు. వీరికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమై 11 రోజులు గడిచినా కొత్త వారికి ఇంకా ఇవ్వలేదు. తమకు కార్డు వచ్చినా బియ్యం రావడం లేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం రేషన్ డీలర్ వద్దకు వెళ్లి తమకు బియ్యం వచ్చింది లేనిదీ తెలుసుకుంటున్నారు.
గణతంత్ర దినోత్సవం రోజున జిల్లాలోని దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామానికి చెందిన ఎర్రబాబు పేరిట కొత్త రేషన్ కార్డు ఇచ్చారు. ఈ నెల 1వ తేదీ నుంచి బియ్యం వస్తాయని అధికారులు చెప్పారు. కానీ 15 రోజులు గడిచినా బియ్యం జాడ లేదు. రేషన్ డీలర్‌ను అడిగితే మీకు కోటా రాలేదని సమాధానం చెబుతున్నారని ఆయన ఎర్ర శోభ వాపోయారు.
![కొత్త రేషన్ కార్డును చూపిస్తున్న మహిళ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/23527530_no-rice-distribution-for-new-ration-card-holdersss.jpg)
తాడ్వాయి మండలంలో సంతాయిపేట గ్రామాన్ని సంక్షేమ పథకాల అమలుకు ఎంచుకున్నారు. గత నెల 26న కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ గ్రామంలో కొత్త వారికి ఒక్కరికి కూడా బియ్యం రాలేదు. కోటా రాకపోవడంతో బియ్యం ఇవ్వడం లేదని డీలర్లు అంటున్నారు.
సభ్యుల పేర్లు చేర్చడం పూర్తి కాలేదా? : కుటుంబ యజమాని పేరుపైనే కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. వారి కుటుంబీకుల పేర్లను కులగణన నివేదిక నుంచి తీసుకుని కార్డుల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రక్రియ 2,3 రోజుల వ్యవధిలో పూర్తి అవుతుందని భావించారు. ఒక్కో మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో రెండంకెల సంఖ్యలోనే రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటికీ కుటుంబీకుల వివరాలు నమోదు పూర్తి కాలేదని సమాచారం. ఈ పాస్ యంత్రాల్లో కొత్త రేషన్ కార్డుదారుల వివరాలు కనిపించడం లేదని డీలర్లు పేర్కొంటున్నారు.
సమస్యను పరిష్కరిస్తాం : జిల్లాలో కొత్త రేషన్‌కార్డుదారులకు ఫిబ్రవరి నెల బియ్యం కోటా విడుదల చేశామని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి మల్లికార్జున్ బాబు తెలిపారు. అయితే డీలర్ల ఈ పాస్ యంత్రాల్లో కొత్త లబ్ధిదారుల వివరాలు కనిపించడం లేదంటున్నారని, ఏం జరిగిందో తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారు.
మీసేవలో ఇచ్చే రశీదు సివిల్ సప్లై ఆఫీసులో ఇవ్వాల్సిన అవసరం లేదు : పౌరసరఫరాల శాఖ స్పష్టత
కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులకు జనాలు క్యూ - జాతరను తలపిస్తున్న 'మీ-సేవ' కేంద్రాలు