Sabarimala Restrictions : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. వార్షిక మండల పూజ కోసం వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ (టీడీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 25, 26 తేదీల్లో అయ్యప్ప ఆలయంలో వర్చువల్, స్పాట్ బుకింగ్‌లను పరిమితం చేయాలని నిర్ణయించింది.
డిసెంబర్ 25, 26 తేదీల్లో వరుసగా 50వేలు, 60వేలు మంది భక్తులను మాత్రమే దైవ దర్శనానికి అనుమతించనున్నారు. ఈ రెండు రోజుల్లో స్పాట్ బుకింగ్ - కేవలం 5000 మందికి మాత్రమే పరిమితం చేయనున్నారు.
"డిసెంబర్ 25వ తేదీన థంక అంకి ఊరేగింపు శబరిమల సన్నిధానానికి (ఆలయ సముదాయం) చేరుకుంటుంది. కనుక భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఆ రోజు కేవలం 50,000 మంది యాత్రికులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తాం" అని టీడీబీ తెలిపింది.
డిసెంబర్ 26న పవిత్ర మండల పూజ జరగనుంది. కనుక ఆ రోజు కూడా 60,000 మంది యాత్రికులను మాత్రమే కొండపై ఉన్న ఆలయంలోకి అనుమతించనున్నారు. పండగ రోజుల్లో భక్తుల రద్దీని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీబీ వెల్లడించింది.
Sabarimala Mandala Pooja :శబరిమల అయ్యప్ప మండల పూజకు సన్నాహాలు పూర్తైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఏడీఎం అరుణ్ నాయర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు ఏర్పాట్లపై సమీక్షించినట్లు పేర్కొన్నారు.
మండల పూజ నేపథ్యంలో!
మండల పూజ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబరు 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ క్రమంలో తొలుత అయ్యప్ప స్వామిని 'తంకా అంకి'తో అలంకరించిన తర్వాత, పవిత్రమైన బంగారు వస్త్రాన్ని ఉత్సవ ఊరేగింపుతో ఆలయానికి తీసుకొస్తారు. తర్వాత మండల పూజ నిర్వహిస్తారు.
భారీగా భక్తులు వచ్చే అవకాశం!
తంకా అంగీ దీపారాధన, మండల పూజ సందర్భంగా డిసెంబర్ 22 నుంచి అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు కావడం వల్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా అయ్యప్పను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాలని ఏడీఎం అధికారులను ఆదేశించారు.