Maoist Chalapathi Encounter : మావోయిస్టు అగ్రనేత చలపతి ఎన్‌కౌంటర్‌తో ముడిపడిన మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తన కదలికల విషయంలో చలపతి చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. అయితే జనవరి 20న ఆయన ఎన్‌కౌంటర్‌కు దారితీసిన బలమైన కారణం ఒకటి వెలుగులోకి వచ్చింది.
2016 సంవత్సరం మే నెలలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ సందర్భంగా మావోయిస్టులకు చెందిన ఒక స్మార్ట్ ఫోన్ పోలీసుల చేతికి చిక్కింది. దానిలోని సమాచారాన్ని జల్లెడపట్టగా మావోయిస్టు అగ్రనేత చలపతి తన భార్య అరుణతో దిగిన ఒక సెల్ఫీ కనిపించింది. ఎప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు మావోయిస్టుల్లో చేరిన చలపతి రూపురేఖలు ఎలా ఉన్నాయి ? అతడి పోలికలు ఏమిటి ? అనేది అంతుచిక్కకుండా ఉన్న తరుణంలో ఈ సమాచారం పోలీసులకు బాగా ఉపయోగపడింది. రూ.1 కోటి రివార్డు కలిగిన చలపతిని పట్టుకునే దిశగా భద్రతా బలగాలను నడిపించింది.
తన సెల్ఫీ ఫొటో పోలీసులకు దొరికిందని తెలిసినప్పటి నుంచి చలపతి అప్రమత్తం అయ్యాడు. ఎక్కడికి వెళ్లినా తన వెంట డజన్ల కొద్దీ మావోయిస్టులను రక్షణగా తీసుకెళ్లేవాడు. ఈక్రమంలో జనవరి 20వ తేదీన (సోమవారం) తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో తన టీమ్‌తో కలిసి చలపతి వెళ్తుండగా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆయనతో పాటు 14 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. సెల్ఫీలో ఉన్న ఫొటో, అక్కడ చనిపోయిన ఒక మావోయిస్టు మొహం ఒకేలా ఉందని నిర్ధరించుకున్నారు.
చాకచక్యంగా చలపతి వ్యూహాలు
చలపతి అసలు పేరు రామచంద్రా రెడ్డి. ఈయన ఉమ్మడి చిత్తూరు జిల్లా వాస్తవ్యులు. 2008 సంవత్సరం ఫిబ్రవరి 15న ఒడిశాలోని నయాఘర్ జిల్లాలో భద్రతా బలగాలపై దాడికి అతడే సూత్రధారి. ఆ దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ దాడికి ముందు అడవుల చుట్టూ ఉన్న రోడ్లపై పెద్దపెద్ద చెట్లను, కర్ర దుంగలను పరిచారు. ఆ తర్వాతే భద్రతా బలగాలపై దాడి చేశారు. వెంటనే తన టీమ్‌తో అక్కడి నుంచి చలపతి పరారయ్యాడు. రోడ్లపై ఉన్న చెట్లు, కర్ర దుంగలను తొలగించి అడవుల్లోకి భద్రతా బలగాలు ప్రవేశించే సరికి, చలపతి టీమ్ ఆ అడవులను దాటేసింది. ఇందువల్లే నయాఘర్ అడవులను భద్రతా బలగాలు చుట్టుముట్టినా చలపతిని పట్టుకోలేకపోయాయి. వాస్తవానికి ఈ దాడి చేయమని చలపతిని చెప్పింది నాటి మావోయిస్టు అగ్రనేత దివంగత రామక్రిష్ణ అని తదుపరిగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
బుధవారం కూడా ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు తెలిసింది. మెయిన్‌పుర్ పోలీసు స్టేషన్ ఏరియాలోని కుల్హాడీ ఘాట్ భాబాదిఘీ హిల్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరుగుతోందని గరియాబంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రఖేఛా వెల్లడించారు. సోమవారం నుంచి కొనసాగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగిందనే వార్తలు వెలువడుతున్నాయి.