Kumbh Mela 2025 Stampede: మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అనేకమంది గాయపడ్డారు. తొక్కిసలాటపై కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడారు. విపరీతమైన రద్దీ వల్ల ఎటు వెళ్లాలో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొందని తెలిపారు. చీకట్లో కన్పించని చెత్త బుట్టలు కాళ్లకు తగలడం వల్ల చాలామంది కింద పడిపోయారని చెప్పారు.
'మౌని అమావాస్య కావడం వల్ల బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో త్రివేణి సంగమానికి చేరుకున్నారు. తలపై పెద్దపెద్ద లగేజీలతో భక్తులు వచ్చారు. అయితే పుణ్యస్నానాలు చేయడానికి ఎటువైపు వెళ్లాలనే దానిపై చాలామందికి స్పష్టత లేదు. భక్తుల సౌకర్యార్ధం త్రివేణీ సంగమం పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ఇనుప చెత్త డబ్బాలను ఏర్పాటుచేశారు. చీకట్లో అవి భక్తులకు కనిపించలేదు. దీంతో ఆ చెత్తడబ్బాలు తగిలి చాలా మంది కిందపడ్డారు. దీనివల్లే తొక్కిసలాట జరిగింది' అని పలువురు ప్రత్యక్ష సాక్షులు ఒక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌కు చెప్పారు.
చెత్త డబ్బా తగిలి తాను కూడా కింద పడ్డానని, ఏదో ఒక విధంగా అక్కడి నుంచి కుటుంబంతో సహా బయటకు వచ్చానని మరో ప్రత్యక్ష సాక్షి వివరించాడు. వేరే భక్తులను కాపాడే క్రమంలో స్వల్పంగా గాయాలు అయ్యాయని తెలిపాడు. రామ్‌సింగ్ అనే ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ 'తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో జనం నిండిపోయారు. దీంతో ఎటు వెళ్లాలో ఎవరికీ అర్థం కాలేదు. ఈ క్రమంలో కొందరు నా కళ్ల ముందే స్పృహ తప్పి కిందపడ్డారు. చెత్త డబ్బాలు తగిలి ఇంకొందరు కిందపడ్డారు' అని చెప్పాడు.
పదుల సంఖ్యలో భక్తుల మృతి ?
భక్తులంతా త్రివేణీ సంగమం ప్రధాన ఘాట్ వద్దే స్నానం చేసేందుకు యత్నించడం వల్ల ఆ మార్గంలోని బ్యారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామన్నారు. త్రివేణి సంగమానికి కిలోమీటరు దూరంలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అనేకమంది గాయాల పాలయ్యారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద కాసేపు పుణ్య స్నానాలను ఆపేసి, ఆ తర్వాత పునరుద్ధరించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు దాదాపు 3 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళా మొదలయ్యాక ఇప్పటివరకు 20 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.