Nirmala Sitharaman Budget Team : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా చరిత్రను సృష్టించబోతున్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర బడ్జెట్‌ను రూపొందించేందుకు నిర్మలా సీతారామన్ టీమ్ ఎంతో శ్రమించింది. దాదాపు రూ.50 లక్షల కోట్లకుపైగా విలువ చేసే బడ్జెట్ రూపకల్పన అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ మహా క్రతువును నిర్మల సారథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంతపాండే విజయవంతంగా పూర్తి చేశారు. ఈ తరుణంలో కేంద్ర బడ్జెట్ టీమ్ గురించి తెలుసుకుందాం.
సవాళ్ల నడుమ బడ్జెట్ తయారీ
అనేక సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈసారి కేంద్ర బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. భారత ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు 6.4 శాతంగా నమోదైంది. ఇది నాలుగేళ్ల కనిష్ఠ స్థాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తోంది. కరోనా సంక్షోభ కాలం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ ఇంతలా క్షీణించడం ఇదే తొలిసారి. ఇటీవల ఒకానొక దశలో డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.7కు పతనమైంది. దేశంలోని వినియోగ డిమాండ్ మోస్తరు స్థాయిలో కొనసాగుతోంది.
ప్రైవేటు పెట్టుబడులు అంతంత మాత్రంగానే దేశానికి వస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నిర్మలా సీతారామన్ టీమ్ కేంద్ర బడ్జెట్‌ను తయారు చేసింది. దేశ రాబడులు, ఆదాయాలు ఏ మాత్రం తగ్గకుండా, ఆర్థిక వృద్ధిరేటును పెంచేలా బడ్జెట్ రూపకల్పనపై ముమ్మర కసరత్తు చేసింది. అదే సమయంలో దేశ స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)లో ద్రవ్యలోటు 4.5 శాతానికి మించి ఉండకుండా జాగ్రత్త పడ్డారు. ఇన్ని జాగ్రత్తలతో రూపొందించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రజల ముందుకు తీసుకురానున్నారు.
బడ్జెట్ టీమ్‌లో వీరే
ఈసారి బడ్జెట్ తయారీ టీమ్‌లో కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తుహిన్ కాంతపాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేఠ్, వ్యయ విభాగం కార్యదర్శి మనోజ్ గోవిల్, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏఎం) కార్యదర్శి అరుణిశ్ చావ్లా, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం.నాగరాజు, ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ ఉన్నారు.
తుహిన్ కాంత పాండే
- తుహిన్ కాంత పాండే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, రెవెన్యూశాఖ కార్యదర్శి. ఈయన ఆర్థిక శాఖలో చాలా సీనియర్ అధికారి.
- 2019 అక్టోబరులో ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏఎం) కార్యదర్శిగా తుహిన్ చేరారు. అప్పటి నుంచే కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియలో ఆయన పాల్గొంటున్నారు.
- ఈయన 1987 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి.
- 2024 సెప్టెంబరులోనే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా తుహిన్ నియమితులు అయ్యారు. ఈ శాఖలో రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సేవలు, వ్యయ విభాగం, డీఐపీఏఎం, డీపీఈ అనే ఆరు విభాగాలు ఉంటాయి.
- డీఐపీఏఎం కార్యదర్శి హోదాలో ఎయిర్ ఇండియా నుంచి ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను తుహిన్ పర్యవేక్షించారు.
అజయ్ సేఠ్
- అజయ్ సేఠ్ ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా ఉన్నారు.
- ఈయన 2021 నుంచి కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో పాల్గొంటున్నారు.
- యావత్ బడ్జెట్ తయారీ ప్రక్రియను ఈయన విభాగమే పర్యవేక్షిస్తుంది.
- ఆదాయాలు, వ్యయాలు, రుణాల వివరాలతో కూడిన బ్యాలెన్సు షీట్ల లెక్కలను ఈ విభాగమే తనిఖీ చేస్తుంది.
- దేశపు తొలి సావరిన్ గ్రీన్ బాండ్ల జారీలో ఈయన కీలక పాత్ర పోషించారు.
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ విభాగం ఏర్పాటులో ప్రధాన పాత్ర అజయ్‌దే.
మనోజ్ గోవిల్
- మనోజ్ గోవిల్ 1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి.
- 2024 ఆగస్టులో ఈయన కేంద్ర వ్యయ విభాగం సారథిగా బాధ్యతలు చేపట్టారు.
- కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో మనోజ్ పాల్గొనడం ఇదే తొలిసారి.
అరుణిశ్ చావ్లా
- ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏఎం) కార్యదర్శిగా అరుణిశ్ చావ్లా వ్యవహరిస్తున్నారు.
- ఈయన 1992 బ్యాచ్ బిహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి.
- ఈయన 2024 సంవత్సరంలోనే డీఐపీఏఎం, డీపీఈ విభాగాల సారథిగా బాధ్యతలు చేపట్టారు.
- అరుణిశ్ చావ్లా సారథ్యంలోనే ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది.
ఎం.నాగరాజు
- ఎం.నాగరాజు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా ఉన్నారు.
- ఈయన 1993 బ్యాచ్ త్రిపుర క్యాడర్ ఐఏఎస్ అధికారి.
- బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనను ప్రస్తుతం ఈయన సారథ్యంలోని విభాగం పరిశీలిస్తోంది.
- ఆర్థిక సేవల్లో సైబర్ నేరాలను తగ్గించడం, బ్యాంకింగ్ రంగం ఆరోగ్యవంతంగా పనిచేసేలా చేయడమే ఈ విభాగం లక్ష్యం.
- కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో నాగరాజు పాల్గొనడం ఇదే తొలిసారి.
వి.అనంత నాగేశ్వరన్
- వి.అనంత నాగేశ్వరన్ భారత ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్.
- బడ్జెట్‌కు ఒకరోజు ముందు(జనవరి 31న) వెలువడే ఆర్థిక సర్వే నివేదికను రూపొందించేది ఈయన విభాగమే. 2047 నాటికి వికసిత భారత్‌ను సాధించడానికి ఏమేం చేయాలనే సూచనలు కూడా దీనిలో ఉంటాయి.
- ఈయన ఆర్థిక సర్వే నివేదికను తయారు చేయడం ఇది మూడోసారి.
- అనంత నాగేశ్వరన్ దేశ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా 2022 జనవరిలో బాధ్యతలు చేపట్టారు.