Lok Sabha Speaker Election : అత్యంత అరుదుగా జరిగే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఘట్టం మరోసారి పార్లమెంట్లో ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉంది. ఏకాభిప్రాయ సాధనకు అధికార పక్షం చేసిన ప్రయత్నాలు విఫలం కావటం వల్ల ఎన్నిక అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పక్షం ఎన్డీఏ తరఫున రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 10 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నడ్డా, బీజేపీ మిత్రపక్షాలు తెలుగుదేశం, జేడీయూ, జేడీఎస్, ఎల్‌జేపీ ఆయనకు మద్దతుగా నామినేషన్ సెట్లు దాఖలు చేశాయి. విపక్ష ఇండియా కూటమి తరఫున కేరళ నుంచి 8సార్లు కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికైన కె.సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా మూడుసెట్ల నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు సమాచారం.
ప్రయత్నాలు విఫలం
అంతకుముందు స్పీకర్ ఎన్నిక అంశంపై నాటకీయ పరిణామాలు జరిగాయి. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేసినట్లు ప్రతిపక్ష నేతలు చెప్పారు. అందుకు ఖర్గే అంగీకరించటం సహా సంప్రదాయం ప్రకారం ఉపసభాపతి పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఆ విషయమై మంగళవారం ప్రతిపక్ష కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు రాజ్‌నాథ్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ప్రతిపక్షాలకు ఉప సభాపతి పదవి ఇచ్చేందుకు ఆయన హామీ ఇవ్వకపోవటం వల్ల వారు రాజ్‌నాథ్ కార్యాలయం నుంచి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌లు విపక్షాలను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఎన్డీఏ హామీ ఇవ్వకపోవడం వల్లే
సంప్రదాయం ప్రకారం అధికారపక్షం స్పీకర్ పదవి, విపక్షం ఉపసభాపతి పదవి చేపట్టాల్సి ఉంది. 2019లో ఉప సభాపతి లేకుండా లోక్‌సభ నడిచింది. గత పదేళ్లలో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉండటం వల్ల 2014లో సుమిత్రా మహాజన్, 2019లో ఓంబిర్లా స్పీకర్‌గా ఏకగ్రీవమయ్యారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. బీజేపీకి సాధారణ మెజార్టీ కంటే తక్కువ స్థానాలు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈసారి లోక్‌సభలో బలం పెంచుకున్న విపక్షాలు ఉప సభాపతి కోసం పట్టుబడుతున్నాయి. స్పీకర్ పదవి అధికారపక్షం తీసుకుంటే ఉపసభాపతి పదవి తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అందుకు అధికారపక్షం హామీ ఇవ్వకపోవటం వల్ల విపక్షాలు స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని పోటీకి దించాయి.