Delhi Polls Modi Vs Kejriwal : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యే నెలకొంది. సీఎం అభ్యర్థి లేకపోయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోతో ప్రజల్లోకి కమలదళం వెళ్తోంది. మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫొటోతో ప్రచారంలో ఆప్ దూసుకెళ్తోంది. తాము గెలిస్తే అమలుచేసే ఉచిత హామీలు, చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకానికి వివరించే విషయంలో ఇరుపార్టీలు పోటీపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరి ఎన్నికల వ్యూహం ఫలిస్తుంది? దిల్లీ ప్రజలు ఎవరిని విశ్వసించి, ఆశీర్వదిస్తారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
బీజేపీకి సీఎం అభ్యర్థి ఎందుకు లేడు ?
సీఎం అభ్యర్థి లేకున్నా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ట్రాక్ రికార్డు బీజేపీకి ఉంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అందుకు నిదర్శనం. దిల్లీలోనూ అదే వ్యూహంతో కమలదళం బరిలోకి దూకింది. ప్రధాని మోదీ ఫొటోతో హస్తిన ప్రజలకు చేరువయ్యే యత్నం చేస్తోంది. దిల్లీలోనూ బీజేపీ గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని చెబుతోంది. తద్వారా దేశ రాజధాని అభివృద్ధి పయనం వేగాన్ని పుంజుకుంటుందని అంటోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన వంటి పథకాలతో ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ఈ అంశాన్ని ప్రజలకు బీజేపీ క్యాడర్ గుర్తు చేస్తోంది. మొత్తం మీద మోదీకి ఉన్న జనాదరణనే కమలదళం ఎక్కువగా నమ్ముకుంది.
వాస్తవానికి అరవింద్ కేజ్రీవాల్ స్థాయి కలిగిన నేత దిల్లీ బీజేపీలో లేరు. అందుకే సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు కాషాయ పార్టీ వెనుకాడుతోందని రాజకీయ విశ్లేషకుడు మనోజ్ కుమార్ ఝా అభిప్రాయపడ్డారు. సీఎం అభ్యర్థి లేనందున కేజ్రీవాల్ కంటే ఎక్కువ జనాకర్షణ కలిగిన ప్రధాని మోదీ పేరు, ఫొటోతో ప్రజల్లోకి వెళితేనే ఎక్కువ మైలేజీ వస్తుందనే అంచనాలతో కమలదళం ఉందన్నారు. అయితే సీఎం అభ్యర్థి లేకపోవడం వల్ల బీజేపీకి కొంతమేర నష్టమే జరగొచ్చనే విశ్లేషణ వెలువడుతోంది.
కేజ్రీవాల్ సీఎం అభ్యర్థిగా ఉన్నా ఎన్నో ప్రతికూలతలు
నీతి, నిజాయితీ కలిగిన నిఖార్సైన నేతగా ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనను తాను చూపించుకుంటున్నారు. దిల్లీ లిక్కర్ స్కాం, ఆప్ ప్రభుత్వంలోని కీలక నేతలపై కేసులు వంటి అంశం ఆయనకు ఈసారి పెనుసవాళ్లుగా మారనున్నాయి. ఆప్ ప్రభుత్వంలో ఏకంగా సీఎంను మార్చేంతగా సంక్షోభం వచ్చింది. కేజ్రీవాల్ కొంతకాలం పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ దిల్లీ ప్రజల దృష్టిలో పడలేదని భావించడం తప్పే అవుతుంది. తప్పకుండా వీటి ప్రభావం ఓటర్లపై ఉంటుంది. అందుకే ఆప్ ప్రభుత్వంపై అవినీతి మరక ఉందంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ సైతం ఒంటరిగా పోటీ చేసి, ఆప్ ఓట్లను చీల్చేందుకు సిద్ధమైంది. ఇవన్నీఆప్‌కు ప్రతికూలించే అంశాలే.
ఇక ఆప్ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ఉన్నంత మాత్రానా, ఈ అంశాలను పక్కన పెట్టలేమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. దిల్లీ ప్రజలు కేజ్రీవాల్ నాయకత్వంతో పాటు ఆప్ పాలనా కాలంలో జరిగిన పరిణామాలను సైతం లెక్కలోకి తీసుకొని ఎన్నికల్లో తీర్పు ఇస్తారని అంటున్నారు. అయితే దిల్లీలోని స్థానిక సమస్యలపై గళమెత్తే పార్టీగా ఆప్ మంచి పేరు సంపాదించింది. ఇది ప్లస్ పాయింటుగా మారొచ్చు. ఒకవేళ అవినీతి ఆరోపణలు ఆప్‌కు మైనస్ పాయింట్లుగా మారితే, అవి బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి. తాగునీటి సమస్య, కాలుష్యం వంటి అంశాలతో ఆప్ సర్కారుపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను సైతం కమలదళం ఓట్లుగా మార్చుకునే ఛాన్స్ ఉంది.
దిల్లీ ఎన్నికల్లో దళిత ఓట్లపై బీజేపీ గురి - ఆ 30 నియోజకవర్గాలపైనే స్పెషల్ ఫోకస్!
ఆ రెండు పార్టీల్లో ఏది గెలిచినా ఫ్రీగా నెలకు రూ.2,500 - దిల్లీ మహిళలకు బంపర్ ఆఫర్!