తెలంగాణ

telangana

ETV Bharat / bharat

10లక్షల మెజార్టీతో రికార్డ్ గెలుపు- జైలులోనే ఉండి విజయం- ఈ నేతలు స్పెషల్ గురూ! - Lok Sabha Election 2024 Result - LOK SABHA ELECTION 2024 RESULT

Lok Sabha Election 2024 Result : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పలు నియోజకవర్గాల్లో అనూహ్య ఫలితాలిచ్చారు. కొన్ని చోట్ల కేంద్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు ఓటమిపాలయ్యారు. సినీ, క్రీడా ప్రముఖులు తొలిసారి బరిలోకి దిగినా అద్భుత విజయం సాధించారు. మరికొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

Lok Sabha Election 2024 Result
Lok Sabha Election 2024 Result (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 7:29 PM IST

Lok Sabha Election 2024 Result :సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పలు నియోజకవర్గాల్లో అనూహ్య ఫలితాలిచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోదీ లక్షా 50 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘన విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సొనాల్ పటేల్‌పై 6 లక్షల 15 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఘన విజయం సాధించారు. కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి గెలుపొందారు. తన సమీప సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాపై 3.5లక్షలపైగా మెజార్టీ సాధించారు. అటు ఉత్తరప్రదేశ్‌లోని తమ కంచుకోట రాయ్‌బరేలీలో 3.7లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ మరోసారి జయకేతనం ఎగురవేశారు. కేరళలోని తిరువనంతపురంలో తన సమీప బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై 15వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. తిరువనంతపురంలో శశిథరూర్‌ వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. హిమాచల్‌లోని హమీర్‌పూర్ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్‌కు చెందిన సత్పాల్ రైజాదాపై లక్షా 77 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కర్ణాటకలోని షిమోగా లోక్‌సభ స్థానంలో మాజీ సీఎం యడియూరప్ప తనయుడు, BY రాఘవేంద్ర విజయం సాధించారు. హవేరీ నియోజకవర్గంలో మాజీ బసవరాజు బొమ్మై కాంగ్రెస్ అభ్యర్థి ఆనందస్వామిపై 43 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. కర్ణాటకలోని ధార్వాడ్‌లో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసూతీపై 97 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ప్రజ్వల్​ రేవణ్ణ ఓటమి
కర్ణాటకలోని హాసనలో ఎన్​డీఏ కూటమి అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రేయస్‌ ఎం. పాటిల్‌ చేతిలో 43వేల ఓట్ల తేడాతో ప్రజ్వల్ పరాజయం పాలయ్యారు. మహిళలపై లైంగిక దౌర్జన్యం, కిడ్నాప్ వంటి ఆరోపణలపై ఇటీవల ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టయ్యారు.

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ రాజకీయ అరంగేట్రంలోనే జయకేతనం ఎగురవేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా, తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 71వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పంజాబ్​లోని జలంధర్ లోక్​సభ స్థానంలో మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి చరణ్ జిత్ సింగ్ చన్నీ బీజేపీ అభ్యర్థి సుశీల్ రింకూపై లక్షా 75 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానంలో మాజీ సీఎం మహబూబా ముఫ్తీ NC నేత అల్తాఫ్ అహ్మద్‌పై భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. బారాముల్లా స్థానంలో మరో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాజీ MLA అబ్దుల్ రషీద్‌పై పరాజయం చెందారు.

10 లక్షల మెజార్టీతో గెలుపు
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత శంకర్‌ లల్వానీ సరికొత్త చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ స్థానం నుంచి ఆయన ఏకంగా 10 లక్షల 8వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ నేత ప్రీతమ్‌ ముండే 6.9లక్షల మెజార్టీ రికార్డును లల్వానీ బద్దలుకొట్టారు. ఈ నియోజకవర్గంలో చివరి నిమిషంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో 2.18లక్షల మంది నోటాను ఎంచుకున్నారు.

జైలులో ఉండి గెలిచిన వారిస్​ పంజాబ్​ దే చీఫ్​
రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత అర్జున్ రామ్ మేఘ్వాల్ విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గోవింద్ రామ్‌ మేఘ్వాల్‌పై 55 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి షాక్‌ తగిలింది. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి, గాంధీ కుటుంబానికి నమ్మకస్థుడైన కిశోరీ లాల్‌ శర్మ, స్మృతి ఇరానీపై లక్షా 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అటు పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ లోక్‌సభ స్థానంలో "వారిస్‌ పంజాబ్‌ దే" అతివాద సంస్థ చీఫ్ అమృత్‌పాల్‌ సింగ్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్బీర్‌ సింగ్‌ జీరాపై లక్షా 78 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాతీయ భద్రతాచట్టం కింద అరెస్టయి అసోంలోని దిబ్రూగఢ్‌ జైలులో ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్‌ సింగ్‌ కుమారుడు సరబ్‌జీత్‌ సింగ్ ఖల్సా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో తన సమీప ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 70 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు.

'మోదీకి నైతికంగా ఓటమి'- లోక్​సభ రిజల్ట్స్​తో 'ఇండియా'కు నయా జోష్​ - Lok Sabha Elections results 2024

గాంధీనగర్​లో అమిత్​ షా హవా - భారీ మెజార్టీతో రెండోసారి విజయం

ABOUT THE AUTHOR

...view details