Left Parties In India : దేశంలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు బలోపేతమవుతున్నా, స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ఉన్న వామపక్షాల ప్రాబల్యం మాత్రం విస్తరించడం లేదు. తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి 2009 నాటి ఎన్నికల వరకు అవి పోటీ చేసిన స్థానాలు, దక్కించుకున్న సీట్లు, ఓట్లు కాస్త అటూఇటూగా ఒకేస్థాయికి పరిమితమయ్యాయి. కానీ, 2014 నుంచి వామపక్షాల ప్రభావం మరింత తగ్గుముఖం పట్టింది.
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా
1964లో సీపీఐ నుంచి విడిపోయి సీపీఎం పుట్టుకొచ్చింది. అంతకుముందు జరిగిన తొలి మూడు సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ 1962లో గరిష్ఠంగా 29 సీట్లు, 9.94% ఓట్లు దక్కించుకుంది. ఇప్పటికీ ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినవి అదే. సీపీఎం 2004లో గరిష్ఠంగా 43 సీట్లు గెలుచుకుంది. తొలినాళ్లలో దేశంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు పనిచేశాయి. క్రమంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా భావసారూప్య పార్టీలతో జట్టుకట్టడం వల్ల పొత్తులు, సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత
వామపక్షాలు 1989 వరకు కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో పనిచేశాయి. ఆ సంవత్సర కేంద్రంలో ఏర్పడిన వీపీ సింగ్ ప్రభుత్వానికి బయటినుంచి మద్దతిచ్చాయి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత వాటి పంథా మారింది. బీజేపీ వ్యతిరేక విధానాన్ని గట్టిగా ఆచరణలో పెట్టాయి. అప్పటినుంచి కాంగ్రెస్‌కైనా మద్దతివ్వడానికి సిద్ధపడ్డాయే తప్ప, బీజేపీ నీడను కూడా సహించకుండా ముందుకుసాగాయి. దానివల్ల కాంగ్రెస్ వ్యతిరేక పాత్రను వామపక్షాలకు బదులు క్రమంగా ప్రాంతీయ పార్టీలు ఆక్రమించాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, ఒడిశాలో బిజద, బిహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్, అసోంలో అసోం గణపరిషత్ పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక భావజాల ఓటర్లను తమవైపునకు తిప్పుకోగలిగాయి.
హిందూత్వ ప్రభావం అధికంగా ఉండే గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లాంటి రాష్ట్రాల్లో బీజేపీ బాగా బలపడింది. దాంతో వామపక్షాలు సంప్రదాయబద్ధంగా వస్తున్న బంగాల్, త్రిపుర, కేరళకే పరిమితం కావాల్సి వచ్చింది. అంతకుమించి విస్తరించే పరిస్థితులను అవి సృష్టించుకోలేకపోయాయి. 1957 ఎన్నికల్లో 9 రాష్ట్రాల్లో సీట్లు సాధించిన సీపీఐ, 2019కి వచ్చేనాటికి ఒకేఒక్క రాష్ట్రానికి పరిమితమైంది. సీపీఎంకు 1991లో అత్యధికంగా 7రాష్ట్రాల్లో విజయాలు లభించగా, 2019 నాటికి అది 2 రాష్ట్రాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
కొత్త నాయకత్వం కొరవడి
వామపక్షాలు ఇప్పటికీ పేరుకే చాలా రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నా, విజయాలు మాత్రం విస్తరించడం లేదు. వర్తమాన రాజకీయాల్లో కనిపిస్తున్న డబ్బు, కులం, మతం, ప్రాంతం, అవినీతి పోకడలను ప్రోత్సహించకపోవడం, అంతర్గతంగా కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకోలేకపోవడం ఇందుకు మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వామపక్షాల్లో సీపీఎందే పెద్దన్న పాత్ర. బంగాల్, త్రిపుర, కేరళల్లో ఆ పార్టీ సుదీర్ఘకాలంపాటు అధికారంలో కొనసాగింది. మిగిలిన వామపక్షాల బలం దీనిపైనే ఆధారపడి ఉంది. బంగాల్, త్రిపురల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం వల్లే తాము తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆ పార్టీలో అంతర్గత అభిప్రాయం ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో ఎదురైన అనుభవాన్ని గుణపాఠంగా తీసుకొని కేరళలో యువరక్తాన్ని ప్రోత్సహించడం వల్ల వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం సాధ్యమైందన్న భావన కనిపిస్తోంది. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన 2జీ, ఇతర కుంభకోణాలు, అమెరికాతో అణు ఒప్పందాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఉద్యమించాయి. కానీ ఆ ఉద్యమాల ఫలితాలను ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో విఫలమయ్యాయి. ప్రస్తుతం వామపక్షాల ప్రాబల్యానికి కేరళ ఒక్కటే కేంద్రంగా మారింది. దాన్ని నిలబెట్టుకోవడం, దానితో పాటు కొత్త ప్రాంతాలకు విస్తరించడం వాటి ముందున్న సవాల్.
గెలుపు కోసం 16ఏళ్లుగా గిరిజన నాయకుడి పోరాటం- ఏడోసారి లోక్‌సభ బరిలోకి- ఈ సారైనా విజయం వరించేనా? - lok sabha elections 2024
లోక్‌సభ బరిలో నిరుపేద గిరిజన మహిళ- జీరో అకౌంట్ బ్యాలెన్స్- నో సోషల్ మీడియా! - lok sabha elections 2024