LeT Terrorist Arrest In Jammu And Kashmir :భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ఉగ్రవాదిగా మారిన ఒక వ్యక్తిని దేశ రాజధాని దిల్లీలో అరెస్టు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేసినప్పుడు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడిని లష్కరే తోయిబాకు చెందిన రియాజ్ అహ్మద్‌గా గుర్తించారు. రియాజ్ అహ్మద్ రిటైర్డ్ ఆర్మీ జవాను అని గతేడాది జనవరి 31న సైన్యం నుంచి పదవీ విరమణ చేశాడని దిల్లీ డీసీపీ మల్హోత్రా తెలిపారు. పారిపోయేందుకు ప్రయత్నించిన రియాజ్‌ను న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఎగ్జిట్ గేట్ నంబర్ వద్ద అరెస్ట్ చేశామని వివరించారు.
టెర్రరిస్ట్‌ల లక్ష్యం అదే!
జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు రియాజ్, అతడి సహచరులు ప్రయత్నించారని దిల్లీ పోలీసులు తెలిపారు. ఇందుకోసం వారు పాక్‌లో టెర్రరిస్టు హ్యాండ్లర్ నుంచి ఆయుధాలు, మందుగుండు తెప్పించేందుకు కుట్ర పన్నారని వీటితో దాడులు చేయాలన్నది ఈ బృందం లక్ష్యమని దిల్లీ పోలీసులు ప్రకటించారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, సిమ్‌కార్డ్‌ను స్వాధీనం చేసుకొన్నారు.