Doctors Meet Cm Mamata Banerjee :జూనియర్ వైద్యులు, బంగాల్ ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం రెండోసారి సీఎం ఆహ్వానం మేరకు చర్చించడాని వెళ్లిన వైద్యులు లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటూ పట్టుబట్టారు. కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో సాధ్యం కాదని సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. వైద్యులు తనను పదేపదే తనను అవమానించడం తగదని వ్యాఖ్యానించారు. దీంతో వెనక్కి తగ్గని డాక్టర్లు చర్చలు జరపకుండానే వెనుదిరిగారు.
దీనికి ముందు జరిగిన పరిణామాలపై ఓ వైద్యుడు వివరించారు. ''ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని మేం కోరాం. సీఎం నివాసంలో లైవ్ స్ట్రీమింగ్ సాధ్యం కాదని చీఫ్ సెక్రటరీ తెలిపారు. పారదర్శకత కోసం లైవ్ స్ట్రీమింగ్ కావాలని మేము సీఎస్‌కు చెప్పాము. అంతేకాకుండా, లైవ్‌స్ట్రీమింగ్‌కు బదులు, దయచేసి మా వీడియోగ్రాఫర్‌ని అనుమతించండి అని కోరాం. అతను మీటింగ్‌ను రికార్డ్ చేస్తాడు. భద్రతా కారణాల దృష్ట్యా మేము ప్రత్యక్ష ప్రసారం చేయాలనుకుంటున్నాము. ఈ సమావేశంలో పారదర్శకత కోసమే లైవ్ స్ట్రీమింగ్ కావాలంటున్నాం. నిరసన తెలుపుతున్న ఇతర డాక్టర్లుకు కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని మేము సీఎం ఇంటి ముందు వేచి చూస్తున్నాం'' అని జూనియర్ డాక్టర్ తెలిపారు.
అంతకుముందు, కాళీఘాట్‌లోని తన నివాసానికి చేరుకున్న వైద్యులతో మమత బెనర్జీ మాట్లాడారు. ''మీరంతా సమావేశానికి హాజరు కావాలని కోరుతున్నాను. ఈ విషయం కోర్టులో పరిధిలో ఉంది. అందువల్ల చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేం. ఈ సమావేశాన్ని వీడియో-రికార్డ్ చేస్తాం. సుప్రీంకోర్టు నుంచి అనుమతి పొందిన అనంతరం ఆ కాపీని మీకు అందిస్తాం. నేడు మీరు చర్చలకు వస్తామన్నారు. అందుకే మీతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నాను. చర్చలకు వచ్చి ఇలా అవమానించడం తగదు. దయచేసి నన్ను ఇలా అవమానించకండి. ఇప్పటికే నేను మీ కోసం మూడు సార్లు వేచిచూశాను. కానీ మీరు రాలేదు'' అని మమత వారితో చెప్పారు.