Kolkata Doctor Case Protest: కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా గురువారం అర్ధరాత్రి బంగాల్వ్యాప్తంగా వేలాది మహిళలు 'రీ క్లెయిమ్ ది నైట్' పేరుతో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సెల్‌ఫోన్ లైట్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మరోవైపు కొందరు దుండగులు ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఆస్పత్రిలోకి చొరబడ్డారు. అక్కడి సామాగ్రిని నాశనం చేశారు.
'రీ క్లెయిమ్ ది నైట్' పేరుతో ర్యాలీ
బంగాల్లోని దుర్గాపూర్‌లో స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న 'రీ క్లెయిమ్ ది నైట్' పేరుతో మహిళలు అర్ధరాత్రి వేళ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. సెల్‌ఫోన్ లైట్లు వేసి నిరసన ర్యాలీ చేశారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇది మరో కొత్త స్వాతంత్ర్య పోరాటం అనే ప్లకార్డులను ప్రదర్శించారు. వైద్యురాలిపై హత్యాచారం చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్‌కతా సహా పలు నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.