Kolkata Doctor Case Polygraph Test : కోల్‌కతా హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్ మాట మార్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని కోర్టుకు తెలిపినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నిందితుడితో సహా మరో ఆరుగురికి శనివారం పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. సీబీఐ దర్యాప్తులో నేరాన్ని అంగీకరించిన సంజయ్ పాలీగ్రాఫ్ టెస్ట్‌లో మాటమార్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ హత్యాచార కేసుకు సంబంధించి సీబీఐ కస్టడీ ముగియటం వల్ల నిందితుడు సంజయ్‌ను శనివారం కోర్టు ముందు హాజరుపర్చారు అధికారులు. ఈ సందర్భంగా సంజయ్ పాలీగ్రాఫ్ పరీక్షకు అంగీకరించాడు. దర్యాప్తు అధికారులు నిందితుడికి పాలీగ్రాఫ్ పరీక్షలు జరపాలంటే కోర్టుతోపాటు అతడు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాలీగ్రాఫ్ పరీక్షకు ఎందుకు అంగీకరించావని మెజిస్ట్రేట్ ప్రశ్నించగా నిందితుడు సంజయ్‌రాయ్ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలని పాలీగ్రాఫ్ టెస్ట్‌కు అంగీకరించానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ కేసులో తనను కుట్రపూరితంగా ఇరికించారని కన్నీరుపెట్టుకున్నట్లు జాతీయమీడియా కథనాలు వెలువడ్డాయి.
అంతకుముందు సీబీఐ విచారణలో నిందితుడు నేరం అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వైద్యబృందం నిందితుడి మానసికతీరును విశ్లేషించినపుడు ఘటనాక్రమానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు గుక్కతిప్పకుండా చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. నిందితుడిలో కనీసం పశ్చాత్తాపంలేదని ఓ సీబీఐ అధికారి చెప్పినట్లు తెలిసింది. అయితే ఇంతలోనే నిందితుడు మాటమార్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.