తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త కోసం 56ఏళ్ల భార్య అడ్వెంచర్! 40అడుగుల లోతు బావిలో దిగి ప్రాణాలు కాపాడిన మహిళ - KERALA WOMAN SAVES HUSBAND LIFE

సాహసోపేతంగా భర్తను కాపాడుకున్న భార్య - కేరళలోని పిరవోమ్ పట్టణంలో జరిగిన ఘటన

Kerala Woman Saves Husband Life
Kerala Woman Saves Husband Life (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2025, 4:45 PM IST

Kerala Woman Saves Husband Life :భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించింది 56 ఏళ్ల భార్య. దాదాపు 40 అడుగుల లోతు బావిలో దిగి భర్తను మునిగిపోకుండా చూసింది. అనంతరం అగ్నిమాపక, సహాయక సిబ్బంది వారిద్దరిని బయటకు తీశారు. ఈ ఘటన బుధవారం ఉదయం కేరళలోని పిరవోమ్ పట్టణంలో జరిగింది.

ఇదీ జరిగింది
చెట్టు నుంచి మిరియాలను తెంపుతూ రమేశన్(64) అనే వ్యక్తి 40 అడుగుల లోతైన బావిలోకి పడిపోయాడు. అది గమనించిన రమేశన్ భార్య పద్మం (56) వెంటనే అప్రమత్తం అయింది. భర్తను కాపాడుకునేందుకు నడుం బిగించి తన ప్రాణాలను పణంగా పెట్టి, ఒక తాడును పట్టుకుని చాకచక్యంగా బావిలోకి దిగింది. నీటిలో రమేశన్​ను మునిగిపోకుండా ఆపింది. అగ్నిమాపక సిబ్బంది, సహాయక దళాలు వచ్చే వరకు(దాదాపు 20 నిమిషాలు) భర్త మునగకుండా లాగి పట్టుకొని, బావిలో అలాగే ధైర్యంగా నిలబడిపోయింది పద్మం. సహాయక దళాలు బావి నుంచి రమేశన్, పద్మం దంపతులను బయటకు తీస్తున్న దృశ్యాలను కేరళలోని న్యూస్ ఛానళ్లు ప్రసారం చేశాయి. దీంతో 56 ఏళ్ల పద్మం కనబర్చిన సాహసాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

రెస్క్యూ నెట్‌ సాయంతో రమేశన్​ను బావిలోంచి బయటకు తీస్తున్న సిబ్బంది (ETV Bharat)

రెస్క్యూ సిబ్బందిని వద్దని- పద్మం స్వయంగా!
సహాయక చర్యల గురించి ఒక అగ్నిమాపక విభాగం అధికారి పలు వివరాలు వెల్లడించారు. "ఈ ప్రమాదం జరిగిన బావి చాలా లోతుగా ఉంది. అందువల్ల మాకు పైనుంచి రమేశన్, పద్మం దంపతులు సరిగ్గా కనిపించలేదు. నీటిలో సగం మునిగి ఉన్న రమేశన్‌ను లిఫ్ట్ చేయడానికి మేము రెస్క్యూ నెట్‌ను బావిలోకి విసిరాం. రమేశన్‌ను నీటిలో నుంచి ఎత్తి, రెస్క్యూ నెట్‌లోకి వేసేందుకు మా టీమ్ నుంచి ఒకరు బావిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే సిబ్బంది అవసరం లేదని పద్మం చెప్పింది. తానే భర్తను నెట్‌లోకి ఎత్తుతానని చెప్పింది. చెప్పినట్టే ఆమె తన భర్తను ఎత్తి రెస్క్యూ నెట్‌లో వేసింది. ఆ తర్వాత ఆమె బావి నుంచి బయటకు వచ్చింది. తన భర్త ప్రాణాలను నిలుపుకోవాలనే ఆలోచనలో ఆమె ఇదంతా చేయగలిగింది. వారిద్దరికీ పెద్దగా గాయాలు కాలేదు. పద్మం భర్తను వెంటనే ఆస్పత్రికి తరలించాం" అని అగ్నిమాపక అధికారి వివరించారు.

రెస్క్యూ నెట్‌ సాయంతో బావిలోంచి బయటకు వస్తున్న పద్మం (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details