Kejriwal on BJP :2029 లోక్‌సభ ఎన్నికల్లో భారతీ జనతా పార్టీ(బీజేపీ) నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కమలం విజయం సాధించినా- ఆ తర్వాత ఎలక్షన్లో మాత్రం బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిస్తుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్- కాషాయదళంపై విరుచుకుపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
"బీజేపీ సొంత భవిష్యత్‌పై ఆందోళన ఉందంటే అందుకు కారణం ఆమ్ ఆద్మీనే. అందుకే ఆప్‌ను విడగొట్టాలని అనుకుంటోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోకపోతే 2029 కల్లా ఆప్ కచ్చితంగా దేశాన్ని బీజేపీ ముక్త భారత్‌గా మారుస్తుంది. 12 ఏళ్ల క్రితమే ఆప్ ఏర్పడింది. దేశంలో ఇప్పటికే 1350 పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్‌ల తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఆప్‌ను, ఆప్ మంత్రులను వారు (బీజేపీ) ఏవిధంగా లక్ష్యంగా చేసుకున్నారో దేశ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. మా పార్టీలోని నంబర్ 2, 3, 4 స్థాయి నేతలు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. త్వరలోనే నంబర్ 1 (కేజ్రీవాల్)ను కూడా అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి సవాల్ విసిరేది ఆప్ మాత్రమే కాబట్టి ఇదంతా జరుగుతోంది."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం, ఆప్ అధినేత
ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓటింగ్ సందర్భంగా 62 మంది ఆప్ ఎమ్మెల్యేల్లో 54 మంది సభలో ఉన్నారు. తమ ఎమ్మెల్యేలెవరూ పార్టీకి దూరం కాలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారని, కొందరు అనారోగ్యంతో ఉంటే, ఇంకొందరు వేరే ప్రాంతాల్లో ఉన్నారని తెలిపారు. బీజేపీ తమను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన విషయాన్ని సభ్యులే స్వయంగా వివరించారని చెప్పారు.
'నన్ను అరెస్ట్ చేసి ఆప్‌ను అంతం చేయాలని బీజేపీ అనుకుంటోంది. మీరు నన్ను అరెస్ట్ చేయొచ్చు కానీ కేజ్రీవాల్ ఆలోచనలను ఎలా అంతం చేయగలుగుతారు? బ్యూరోక్రసీపై ఆధిపత్యం ఉంటే అభివృద్ధి పనులు ఆగుతాయని బీజేపీ అనుకుంటోంది. రామ భక్తులం అని చెప్పుకునే బీజేపీ ఆస్పత్రుల్లో పేదలకు పంచే ఔషధాలను అడ్డుకుంది. పేదలకు ఔషధాలు ఇవ్వకుండా అడ్డుకోవాలని రాముడు చెప్పాడా?' అని కేజ్రీవాల్ మండిపడ్డారు.