Rahul Gandhi Fires On PM Modi And Kejriwal : ప్రధాని నరేంద్ర మోదీ, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య తేడా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. మోదీ ప్రచారవ్యూహాలు, తప్పుడు వాగ్దానాలనే కేజ్రీవాల్ అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓబీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు వారి హక్కులు దక్కాలని మోదీ, కేజ్రీ కోరుకోవడం లేదని రాహుల్ విమర్శించారు. అందుకే కులగణనపై వారిద్దరూ మౌనం దాల్చారని అన్నారు. దేశంలో పేదలు పేదలుగా, సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని ఆ సమస్యకు కులగణన ద్వారానే పరిష్కారం లభిస్తుందని రాహుల్‌గాంధీ చెప్పారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శీలంపుర్ సభలో పాల్గొన్న రాహుల్ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే గతంలో మాదిరి అభివృద్ధి చేపడతామని హామీ ఇచ్చారు.
'ప్రధాని మోదీ అడుగుజాడల్లో కేజ్రీవాల్- తప్పుడు వాగ్దానాల్లో దొందూ దొందే!' - RAHUL GANDHI FIRES ON PM MODI
ప్రధాని నరేంద్ర మోదీ, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు - తప్పుడు వాగ్దానాల్లో మోదీని కేజ్రీవాల్ అనుసరిస్తున్నారని చురకలు
Published : Jan 14, 2025, 7:37 AM IST
'రిజర్వేషన్లు పెంచుతాం'
"ప్రధాని నరేంద్ర మోదీ, కేజ్రీవాల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఈ విషయంలో వారు విఫలమయ్యారు. దేశ రాజధానిని పరిశుభ్రంగా మారుస్తానని, పారిస్ మాదిరిగా తీర్చిదిద్దుతానని, అవినీతిని నిర్మూలిస్తానని కేజ్రీవాల్ గతంలో చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో కాలుష్యం, అవినీతి, అధిక ధరలు వేధిస్తున్నాయి. ప్రధాని మోదీ తప్పుడు వాగ్దానాల లాగానే, దిల్లీ మాజీ సీఎం కూడా అదే ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దేశంలో పేదలు పేదలుగా, సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారు. ఎస్స్, ఎస్టీ, గిరిజన మైనార్టీలకు వారి హక్కులు లభించడం లేదు. మేము అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం. రిజర్వేషన్లు పెంచుతాం" అని రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. కులగణనను చేపడతారా? అని కేజ్రీవాల్‌ను ప్రశ్నించాలని ప్రజలను కోరారు.
70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న దిల్లీలో వచ్చే నెల 5న పోలింగ్ జరగనుంది. 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలైన ఆప్, కాంగ్రెస్- లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేర్వేరుగా బరిలోకి దిగుతున్నాయి.