తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డ్యూటీ ఫస్ట్ రోజే యువ IPS అధికారి మృతి- టైర్ పేలడమే కారణం- సీఎం సంతాపం

విధుల్లో చేరడానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించిన యువ ఐపీఎస్- 26 ఏళ్లకే మృత్యుఒడిలోకి!

Karnataka IPS Officer Death
Karnataka IPS Officer Death (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Karnataka IPS Officer Death : ఎంతో కష్టపడి చదివి, ఐపీఎస్ కావాలన్న తన కలను నెరవేర్చకున్న ఓ యువకుడు ఉద్యోగంలో చేరడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని హసన్‌లో ఆదివారం జరిగింది.

ట్రైనింగ్ పూర్తి- పోస్టింగ్ కోసం వెళ్తూ!
మధ్యప్రదేశ్‌కు చెందిన హర్ష్​ బర్దన్ (26) 2023 సివిల్స్‌లో కర్ణాటక క్యాడర్‌‌ ఐపీఎస్​గా ఎంపికయ్యారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న హర్ష్‌కు తొలి పోస్టింగ్ హసన్ జిల్లాలో వచ్చింది. ఈ క్రమంలో బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న పోలీసు వాహనం టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఈ క్రమంలో హర్ష బర్దన్ ప్రయాణిస్తున్న పోలీసు వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇల్లు, చెట్టును ఢీకొట్టింది. దీంతో ముందు సీటులో ఉన్న బర్దన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తలకు బలమైన గాయం కాగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్ష్ వర్దన్ ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మంజే గౌడ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జయ్యింది.

సంతాపం తెలిపిన సీఎం
యువ ఐపీఎస్ హర్ష్ బర్దన్ మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. "హసన్-మైసూరు జాతీయ రహదారి కిట్టనే సరిహద్దు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్దన్ మృతి చెందడం విచారకరం. ఐపీఎస్ అధికారిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తుండగా ఇలాంటి ప్రమాదం జరగడం బాధాకరం. ఏళ్ల తరబడి శ్రమ ఫలిస్తున్న సమయంలో అలా జరగకూడదు. హర్ష్ బర్దన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి." అని సిద్ధరామయ్య ఎక్స్​లో పోస్ట్ చేశారు.

హర్ష్ బర్ధన్ ఎవరు?
మధ్యప్రదేశ్​కు చెందిన హర్ష్ బర్దన్ బీఈ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో పూర్తి చేశారు. 2023 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి. మైసూర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్​లో 4 వారాల శిక్షణ పూర్తి చేశారు. 6 నెలల పాటు హసన్‌ జిల్లాలో ప్రాక్టికల్ శిక్షణ పొందాల్సి ఉంది. ఈ క్రమంలో హర్ష్ బర్దన్​ను ప్రొబేషనరీ అధికారిగా హసన్ జిల్లాకు కేటాయించారు. కాగా, హర్ష్ బర్దన్ తండ్రి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్​గా పనిచేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details