Road Accident In Rangareddy District : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సాన్ని సృష్టించిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్- బీజాపూర్ రహదారి వద్ద 50 మంది కూరగాయలను అమ్ముతుండగా ఈ క్రమంలో ఒక్కసారిగా అటువైపుగా వస్తున్న లారీ వారిపైకి దూసుకెళ్లింది. దూసుకువస్తున్న లారీని చూసిన వ్యాపారులు అప్రమత్తమై భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి ఆగిపోగా డ్రైవర్ మాత్రం క్యాబిన్లోనే ఇరుక్కుపోయాడు. లారీ బలంగా ఢీకొట్టడం వల్ల ఆ చెట్టు నేలకూలింది.
ఈ ఘటనతో ఒక్కసారిగా హైదరాబాద్- బీజాపుర్ రహదారిపై భీతావహ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో మృతులను రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి : రంగారెడ్డి జిల్లాలో జరిగిన లారీ బీభత్సంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.