Private Hospitals in Hyderabad City : ఏదైనా జబ్బు చేస్తే ప్రైవేటు దవాఖానాలకు వెళ్లడానికి పేద, మధ్యతరగతి రోగులు జంకుతున్నారు. ఎందుకంటే అక్కడ వైద్యం చేసుకుంటే వేల రూపాయలు ఖర్చు అవుతాయని భయపడతారు. అదేవిధంగా ఆ ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులకు వెళ్లాలన్నా కాస్త జంకుతారు. ఎందుకంటే ఇక్కడ ఎంఆర్పీలు కాస్త ఎక్కువగానే ఉంటాయని. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ స్టోర్లు రోగులను నిలువునా దోచేస్తున్నాయి. మందులను ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకు వసూలు చేస్తూ రోగుల జేబులకు భారీగా చిల్లు పెడుతున్నాయి. మలక్‌పేట్ జడ్డికాలనీలోని హైదరాబాద్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో డీసీఏ (డ్రగ్ కంట్రోల్ అథారిటీ) అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఒక్కో టాబ్లెట్ ఏకంగా 12 నుంచి 15 రెట్లు అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించారు.
అలెర్జీ మాత్ర రూ.100 : అలెర్జీ కోసం వాడే అవిల్ ఇంజక్షన్ ఎమ్మార్పీ రూ.6.16 అయితే ఇక్కడ రూ.100 ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని మెడికల్ షాప్‌లల్లో ఎమ్మార్పీ ధరలై 10 నుంచి 20 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తుంటారు. అయితే ప్రైవేటు హస్పిటల్స్‌కు అనుసంధానంగా ఉన్న మెడికల్ దుకాణాలు ఈ నిబంధనలు భేఖాతరు చేస్తున్నాయి. ఇష్టారీతిన ధరలు వేసి రోగుల నుంచి డబ్బుల వసూళ్ల దందా కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలు ఎక్కువవుతున్నాయని, ప్రజల రక్తాన్ని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు మెడికల్ దుకాణాల రూపంలో జలగలుగా తాగేస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అధికారులు దీనిపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్‌లని అనేక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు, ప్రభుత్వ వైద్యులు, మెడికల్ దుకాణాల యాజమాన్యాలు కలిసి సిండికేట్‌గా మారి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
"మెడిసిన్స్‌పై ముద్రించిన ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం. డ్రగ్స్ ప్రెస్ కంట్రోల్ ఆర్డర్ 2003 ప్రకారం నిర్ణయించిన ధరకే పేషెంట్లకు మందులు విక్రయించారు. ఈ ఆర్డర్‌ను పట్టించుకోకుంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్టు 1955 ప్రకారం కఠినమైన జైలు శిక్ష పడుతుంది. ఏ ఆసుపత్రిలోనైనా ఎక్కువ ధరకు మందులు విక్రయించినట్లు గుర్తిస్తే ప్రజలు ఔషధ నియంత్రణ శాఖ దృష్టికి తేవాలి. టోల్‌ఫ్రీ నెంబరు 1800-599-6969 ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతాం." -వి.బి.కమలాసన్‌రెడ్డి, డీజీ, ఔషధ నియంత్రణ శాఖ
సిద్దిపేట నుంచి రష్యాకు నకిలీ యాంటీబయోటిక్స్ సరఫరా - రూ.1.50 కోట్ల మందులు సీజ్
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతున్నారా? జీర్ణకోశంలో ఈ సమస్యలు వస్తాయట! ఇవి పాటిస్తే అంతా సెట్!!