SC Seeks EC Reply : ఒక పోలింగ్ స్టేషన్‌కు సంబంధించి గరిష్ఠ ఓటర్ల సంఖ్యను 1,200 నుంచి 1,500 వరకు పెంచాలని ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్) పై సుప్రీంకోర్ట్ విచారణ జరిపింది. ఈ పిల్‌పై ఈసీ తన అభిప్రాయం చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం సోమవారం ఈ ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపింది. పోలింగ్ స్టేషన్‌లో గరిష్ఠ ఓటర్ల సంఖ్య పెంచడానికి ఉన్న కారణాన్ని వివరిస్తూ మూడు వారాల్లోగా ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్‌ను ఆదేశించింది. గరిష్ఠ ఓటర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించడం ఆందోళనకరమని, ఏ ఓటరు కూడా తన ఓటింగ్ హక్కును కోల్పోకూడదని సుప్రీం స్పష్టం చేసింది.
రాజకీయ పార్టీలతో సంప్రదించి నిర్ణయం
'ఒక్కో ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లో మొత్తం ఓటర్ల సంఖ్యను పెంచినప్పుడు కచ్చితంగా సదరు నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఈసీ సంప్రదిస్తుంది' అని ఈసీ తరఫున హాజరైన న్యాయవాది మణిందర్ సింగ్ సుప్రీంకోర్ట్‌కు తెలిపారు. నిర్ణీత సమయం దాటినా- అప్పటికే పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసేందుకు ఈసీ అనుమతిస్తుందని స్పష్టం చేశారు.
జనవరిలో తదుపరి విచారణ
సుప్రీంకోర్ట్ బెంచ్ ఈ పిల్ తరువాతి విచారణను 2025 జనవరి 25కు వాయిదా వేసింది. ఈ తేదీలోపు పిటిషనర్‌కు ఈసీ తన అఫిడవిట్ కాపీని అందజేయాలని స్పష్టం చేసింది.
ఎలక్షన్ కమిషన్ ఆగస్ట్ నెలలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్‌లోని ఓటర్ల సంఖ్యను పెంచుతూ 2 ప్రకటనలు జారీ చేసింది. దీనిపై ఇందుప్రకాశ్ సింగ్ సుప్రీంకోర్ట్‌లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈసీ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, ఎలాంటి అభిప్రాయ సేకరణ చేయకుండా, డేటాను విశ్లేషించకుండా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు.