తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక సీఎం మార్పు! దిల్లీకి చేరిన పంచాయితీ- ఈసారైనా డీకేకు అవకాశం దక్కేనా? - Karnataka CM Post

Karnataka CM Post Issue : కర్ణాటకలో అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతుంది. ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి ఇప్పటికే విమర్శలు వస్తుండగా, తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో తమ వర్గం వారికే ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.

Karnataka CM Post Issue
Karnataka CM Post Issue (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 10:05 AM IST

Karnataka CM Post Issue: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం స్థానాన్ని తమ వర్గం వారికే ఇవ్వాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి స్థానాన్ని లింగాయతలకు ఇవ్వాలని కొందరు మఠాధిపతులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే సీఎం పదవిని డీకే శివకుమార్‌కు కేటాయించాలని విశ్వ ఒక్కలిగర పీఠాధిపతి చంద్రశేఖరనాథ స్వామి నేరుగా సిద్ధరామయ్యకే సూచించారు. ఇప్పటి వరకు దళితులకు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదని, ఈసారి వారికే పదవి ఇవ్వాలని మాజీ మంత్రి నరేంద్రస్వామి కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు.

మరోవైపు గ్యారంటీలతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, మహర్షి వాల్మీకి షెడ్యూలు కులాలు, తెగల అభివృద్ధి కార్పొరేషన్‌ అక్రమాలు, పాలు, ఇంధన ధరల పెంపును ప్రధాన అస్త్రాలుగా చేసుకుని బీజేపీ, దళ్‌ ప్రభుత్వంపై పోరును కొనసాగిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి మార్పు, ఉప ముఖ్యమంత్రుల సంఖ్య పెంపు విమర్శలు పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గపు నేతలుగా గుర్తింపు పొందిన వారే ఈ వివాదాన్ని రాజేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తన సన్నిహితుల వద్ద ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం గురించే మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి వివరించారు. సిద్ధరామయ్యకు సన్నిహితంగా ఉండే ఎంబీ పాటిల్, నరేంద్ర స్వామి, జమీర్‌ అహ్మద్‌ ఖాన్, రాజణ్ణ తదితరులే ముగ్గురు ఉపముఖ్యమంత్రుల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. పార్టీ సీనియర్​ నాయకులు సోనియా, రాహుల్‌లతో చర్చించి, వివాదాన్ని పరిష్కరిస్తానని శివకుమార్‌కు ఖర్గే భరోసా ఇచ్చి పంపించారు.

ఒక పదవిని వదులుకోవాలి
కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సమితికి డీకే శివకుమార్‌ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగానూ కొనసాగుతున్నారు. రెండు పదవుల్లో ఒకదాన్ని వదులుకోవాలని శివకుమార్​కు హోం శాఖ మంత్రి డాక్టర్‌ జి పరమేశ్వర్‌ పరోక్షంగా చెప్పారు. మంత్రి పదవిని నిర్వహిస్తున్న సమయంలో పార్టీని సమన్వయం చేసుకోవడం సాధ్యం కాదన్నారు. కర్ణాటకలో అత్యధిక సమయం కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు వహించిన తనకు సమన్వయానికి సంబంధించిన సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. అదనపు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి తాను ఒకసారి కూడా పార్టీ పెద్దల వద్ద మాట్లాడలేదన్నారు. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఇక్కడి నేతల కన్నా, అధిష్ఠానానికే బాగా తెలుసని అన్నారు. ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే మినహా తానే కేపీసీసీకి అధ్యక్షుడిగా కొనసాగాలని శివకుమార్‌ కోరుకుంటున్నారు. శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా కొనసాగించి, ఎంబీ పాటిల్‌ లేదా సతీశ్‌ జార్ఖిహొళి ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ ఆ స్థానం ఖాళీ అయితే దాన్ని తన ఆప్తుడు డాక్టర్‌ హెచ్‌సీ మహదేవప్పకే దక్కేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పావులు కదుపుతున్నారు.

హై మాత్రమే ఉంది, కమాండ్‌ లేదు
కాంగ్రెస్‌లో కేవలం 'హై' మాత్రమే ఉందని, పార్టీ నేతలపై ఎవరికీ 'కమాండ్‌' లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి హుబ్బళ్లిలో అన్నారు. అధికార పార్టీ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, ధరల పెంపును కూడా ఆ పార్టీ అధిష్ఠానం ప్రశ్నించలేకపోతోందని వ్యాఖ్యానించారు. ముగ్గురు డీసీఎంలు అవసరమని వస్తున్న డిమాండ్ల వెనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారని తెలిసినా, స్పందించేందుకు ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని తెలిపారు. ఈ వివాదాలతోనే పాలన పూర్తిగా దారి తప్పిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ పట్టుకోల్పోయారని ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ హుబ్బళ్లిలో వ్యాఖ్యానించారు. ఈ వివాదమే తీవ్రమై ప్రభుత్వం పతనం అవుతుందని జోస్యం చెప్పారు.

గద్దే దించింతే పోరాటమే
ముఖ్యమంత్రి పీఠం నుంచి సిద్ధరామయ్యను గద్దెదింపితే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని చేస్తామని అహింద రాష్ట్రాధ్యక్షుడు ప్రభులింగ దొడ్డణి హెచ్చరించారు. ఐదేళ్ల పాటు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని హుబ్బళ్లిలో ఆయన పేర్కొన్నారు. కొందరు మఠాధిపతులు రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం శోచనీయమన్నారు. చంద్రశేఖరానందనాథ స్వామి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, దాన్ని కాంగ్రెస్‌ ఆమోదించవలసిన అవసరం లేదన్నారు.

నన్ను ఎవరూ ఒత్తిడి చేయలేదు
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కావాలన్నది తనతో పాటు ఒక్కలిగ సముదాయం నేతలు అందరూ కోరుకుంటున్నారని విశ్వ ఒక్కలిగ మహా సంస్థాన మఠాధిపతి చంద్రశేఖరనాథ స్వామి పేర్కొన్నారు. వేదికపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇదే విషయాన్ని చెప్పాలని తనపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వం 2023లో ఏర్పడినప్పుడు మొదట సిద్ధరామయ్య, అనంతరం డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని ప్రచార మాధ్యమాల ద్వారా తాను తెలుసుకున్నానని అన్నారు. అదే విషయాన్ని సిద్ధరామయ్యకు కూడా సూచించానని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ 135 స్థానాల్లో విజయం సాధించేందుకు సిద్ధు, శివకుమార్‌ ఇద్దరూ సమానంగా శ్రమించారని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీకి కావలసిన సాయం చేసి ట్రబుల్‌ షూటర్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. మంత్రిగా పలు సార్లు సేవలు అందించిన ఆయన ముఖ్యమంత్రిగా కూడా విజయం సాధిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.

అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు- ఇకపై ఆ నేరాలకు పాల్పడితే అంతే సంగతి! - New Criminal Laws In India 2024

'వెంకయ్య నాయుడు అరుదైన రాజనీతిజ్ఞుడు'- 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ వ్యాసం - PM Modi on Venkaiah Naidu

ABOUT THE AUTHOR

...view details