Karnataka CM Siddaramaiah Love Story : తాను కులాంతర వివాహం చేసుకోవాలనుకున్నానని, అందుకు తన ప్రేయసి, ఆమె కుటుంబం అంగీకరించలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఆ తర్వాత తన కులానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. మైసూరులో బుద్ధపూర్ణిమ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో గురువారం రాత్రి సిద్ధరామయ్య మాట్లాడారు. ఈ క్రమంలో తన కాలేజీ రోజుల్లో జరిగిన లవ్ స్టోరీని గుర్తు చేసుకున్నారు. సిద్ధరామయ్య తన విఫల ప్రేమ కథను వెల్లడించిన సమయంలో సభికులు చప్పట్లతో సభను మార్మోగించారు.
"నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. నేను ఆమెను కులాంతర వివాహం చేసుకోవాలనుకున్నాను. కానీ కులం కారణంగా నా ప్రేయసి, ఆమె కుటుంబం పెళ్లికి అంగీకరించలేదు. దీంతో నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి జరగలేదు. ఆ తర్వాత నా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. "
--సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
'కులాంతర వివాహాలకు నా పూర్తి మద్దతు'
కులాంతర వివాహాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కులాంతర వివాహాలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. కులతత్వాన్ని రూపుమాపడానికి రెండే మార్గాలున్నాయన్నారు సిద్ధరామయ్య. అందులో ఒకటి కులాంతర వివాహాలు, రెండోది అన్ని వర్గాల మధ్య సామాజిక-ఆర్థిక సాధికారిత అని పేర్కొన్నారు.