Kangana On Farmers Protest : మూడు వ్యవసాయ చట్టాల రద్దుకోసం రైతులు చేసిన ఆందోళనపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనిపై విపక్షాలు, అఖిల భారత కిసాన్ సభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలు యావద్దేశ రైతులను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు కంగనా వ్యాఖ్యలను బీజేపీ సైతం తప్పుబట్టింది. దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లయితే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు తలెత్తేవని ఇటీవల ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ అన్నారు. ఈ వీడియోను 'ఎక్స్' ద్వారా పంచుకున్నారు. రైతు ఉద్యమ సమయంలో శవాలు వేలాడుతూ ఉండేవని, అత్యాచారాలు జరిగేవని ఆరోపించారు. ఈ రైతు ఉద్యమం వెనుక చైనా, అమెరికాల కుట్ర ఉందని పేర్కొన్నారు.
'రైతులను అవమానించడమే బీజేపీ పని'
కంగనా రనౌత్ వ్యాఖ్యలు యావద్దేశ రైతులను అవమానించేలా ఉన్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. "రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. కానీ వాళ్లను అవమానించే పనిలో పార్టీ బిజీగా ఉంది. 378 రోజుల పాటు చేసిన ఉద్యమంలో అమరులైన 700 మంది రైతులను రేపిస్టులు అని పిలవడం చాలా బాధకరం. రైతులు నిరసనలు ముగించే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటకీ కోల్డ్ స్టోరేజీలోనే ఉంది. పంటలకు కనీస మద్దతు ధరను ఇంకా స్పష్టం చేయలేదు. అమరులైన రైతుల కుటుంబాలకు ఇంతవరకు ఎలాంటి సాయం కూడా అందించలేదు" అని రాహుల్ గాంధీ అన్నారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి పార్లమెంట్లో కూర్చునే అర్హత లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ అన్నారు.