Kachori Recipe in Telugu : సాయంత్రం వేళల్లో అలా బయటకెళ్తే సమోసా, కచోరి, మిరపకాయ బజ్జీ, ఉల్లి పకోడీ వంటి స్ట్రీట్ ఫుడ్స్ నోరూరిస్తుంటాయి. అందులో వెలుపలి వైపు కరకరలాడుతూ, లోపల కారంకారంగా, తియ్యతియ్యగా భిన్న రుచులతో టేస్టీగా ఉండే కచోరిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడుతుంటారు. కానీ, బయట అమ్మే వాటి మీద దుమ్మూధూళీ పడుతుందని కొనుక్కోడానికి వెనకాడుతుంటారు. అలాకాకుండా ఇంట్లోనే ఈజీగా పెసరపప్పుతో ఇలా 'కచోరి' చేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా వీటిని చేసుకోవడం సమోసా కంటే కూడా చాలా ఈజీ! మరి, ఈ సూపర్ స్నాక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మైదాపిండి - 2 కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - తగినంత
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
స్టఫింగ్ కోసం :
- పెసరపప్పు - అర కప్పు
- కారం - రెండు చెంచాలు
- ఛాట్ మసాలా - చెంచా
- ధనియాల పొడి - చెంచా
- ఆమ్‌చూర్ పౌడర్ - చెంచా
- నెయ్యి - 2 చెంచాలు
వంటసోడా లేకుండా అద్దిరిపోయే "అరటికాయ బజ్జీలు" - ఇలా చేస్తే నూనెె తక్కువ, రుచి ఎక్కువ!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
- ఆలోపు ఒక మిక్సింగ్ బౌల్లో మైదాపిండిని తీసుకొని అందులో కొన్ని వాటర్, కాస్త ఉప్పు, నెయ్యి, నూనె వేసి బాగా కలపాలి. ఆపై మూతపెట్టి అరగంట పాటు పక్కనుంచాలి.
- పెసరపప్పు చక్కగా నానిన తర్వాత వాటర్ వడకట్టేసి మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక మిక్సీ పట్టుకున్న పెసరపప్పు ముద్దను వేసి వేయించుకోవాలి.
- అది కాస్త వేగాక అందులో నెయ్యి, కారం, ఉప్పు, ఛాట్ మసాలా, ధనియాల పొడి, ఆమ్‌చూర్ పౌడర్ ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మరికాసేపు వేయించుకొని దించేసుకోవాలి.
- అనంతరం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీటపై ఒక్కో ఉండను ఉంచి చపాతీ రోలర్‌తో పూరీల్లా వత్తుకోవాలి.
- ఆ తర్వాత ఒక్కో పూరీ మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్‌ని రెండు చెంచాలు వేసుకొని అంచులను దగ్గరగా చేసి, చేత్తో తట్టి కచోరీ షేప్ మాదిరిగా వత్తుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక్కొక్కటి వేసుకొని రెండు వైపులా చక్కగా వేయించుకొని తీసుకుంటే సరి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే నోరూరించే "మూంగ్ దాల్ కచోరి" రెడీ!
బండి మీద అమ్మే "ముంత మసాలా" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!