Kamal Haasan Party News :దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే పార్టీలకు మాత్రమే తాము మద్దతిస్తామని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో తాము భాగం కాదని స్పష్టం చేశారు. భూస్వామ్య రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని చెప్పుకొచ్చారు. మక్కల్ నీది మయ్యం ఏడో వార్షికోత్సవం సందర్భంగా చెన్నైలో విలేకరులతో మాట్లాడారు కమల్. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతో పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా- కమల్ ఈ మేరకు సమాధానం చెప్పారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల నటుడు విజయ్ చేసిన ప్రకటనను స్వాగతించారు.
"పార్టీల పేరుతో చేసే రాజకీయాలను విడిచిపెట్టే సమయం ఇది. దేశం కోసం ఆలోచించాలి. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే ఎవరితోనైనా ఎంఎన్ఎం కలుస్తుంది. కానీ స్థానిక భూస్వామ్య రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటుంది. మేం ఇండియా కూటమిలో చేరలేదు. పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీ ద్వారా ప్రజలకు చెబుతా."
- కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం అధినేత
డీఎంకేపై పళనిస్వామి సెటైర్లు!
మరోవైపు, అధికార డీఎంకే పార్టీపై అన్నాడీఎంకే అధినేత, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి విమర్శలు గుప్పించారు. డీఎంకేతో కలుస్తామని ఏ పార్టీ ఇంతవరకు ప్రకటించలేదని అన్నారు. పొత్తుల విషయంలో అన్నాడీఎంకే చర్చలు కొనసాగిస్తోందని చెప్పారు.
'డీఎంకే ఓ కుటుంబ పార్టీ. గతంలో కరుణానిధి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు స్టాలిన్ నాయకత్వం వహిస్తున్నారు. భవిష్యత్లో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి పార్టీ అధినేతగా మారాలని భావిస్తున్నారు. ఇది వారసత్వ రాజకీయం. మా పార్టీ విధానం అది కాదు. నా లాంటి సాధారణ కార్యకర్తలు కూడా పార్టీ నాయకత్వ బాధ్యత చేపట్టగలిగే అవకాశం అన్నాడీఎంకేలో ఉంది'