తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైనిక వాహనంపై ఉగ్రదాడి వారి పనే- ఈమధ్యే సరిహద్దుల్లో నుంచి దేశంలోకి! - Kathua Terror Attack

Jammu Kashmir Terror Attack : జమ్ముకశ్మీర్​లో సైనిక వాహనంపై దాడికి పాల్పడినట్లు పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ అనుబంధ ముఠా కశ్మీర్‌ టైగర్స్‌ ప్రకటించుకుంది. అయితే దాడి చేసిన ముష్కరులు ఈమధ్యే సరిహద్దుల్లో నుంచి దేశంలోకి చొరబడినట్లు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Jammu Kashmir Terror Attack
Jammu Kashmir Terror Attack (ETV Bharat, ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 7:26 AM IST

Jammu Kashmir Terror Attack : జమ్ముకశ్మీర్​లోని కఠువాలో సైనిక వాహనంపై ఆకస్మిక దాడి చేసిన ఉగ్రవాదులు ఈమధ్యే సరిహద్దుల్లో నుంచి దేశంలోకి చొరబడినట్లు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం పోలీసులు, పారామిలటరీ దళం సాయంతో సైనిక సిబ్బంది ఎదురుదాడికి దిగడం వల్ల ఉగ్రవాదులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు చెప్పారు. వెంటనే అదనపు బలగాలు అక్కడికి చేరుకొని ముష్కరులను మట్టుబెట్టడానికి ఆపరేషన్‌ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో భద్రతా దళాలు, ముష్కరుల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు వివరించారు. ముగ్గురు ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోందని, వారి వద్ద భారీ స్థాయిలో ఆయుధాలు ఉండొచ్చని చెప్పారు. తామే ఈ దాడికి పాల్పడినట్లు పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ అనుబంధ ముఠా అయిన కశ్మీర్‌ టైగర్స్‌ ప్రకటించుకుంది.

దేశానికి అండగా!
కఠువాలోని భారత ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడడం చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. "అమరవీరులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మన బలగాలపై పిరికి దాడులు అత్యంత ఖండనీయం. నెల రోజుల వ్యవధిలో జరిగిన ఐదో ఉగ్రదాడి దేశ భద్రతకు, సైనికుల ప్రాణాలకు ముప్పును తెలియజేస్తుంది. తీవ్రవాద దాడులకు పటిష్ఠమైన చర్యల ద్వారానే పరిష్కారం ఉంటుంది తప్ప ఖాళీ ప్రసంగాలు, తప్పుడు వాగ్దానాలు వల్ల కాదు. ఈ దుఃఖ సమయంలో దేశానికి అండగా నిలుస్తాం" అని హామీ ఇచ్చారు.

పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించాల్సిందే!
సాయుధ బలగాలు, పోలీసులు, పారుల జీవితాలను రక్షించడానికి ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించాలని జమ్ముకశ్మీర్ కాంగ్రెస్​ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిర్ణయాత్మక చర్య తీసుకోవడం అత్యవసరమని అని జమ్ముకశ్మీర్ పీసీసీ చీఫ్ వికార్ రసూల్ తెలిపారు.

భారీగా మూల్యం చెల్లించుకుంటారు!
జవాన్ల వాహనంపై జరిగిన ఉగ్రదాడిని జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఖండించారు. ఈ చర్యకు బాధ్యులైన వారు త్వరలోనే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. "పాకిస్థానీ ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడి చేశారు. మన వీర జవాన్లు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఈ సైనికుల అంతిమ త్యాగానికి దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోంది. వారు భారీగా మూల్యం చెల్లించుకుంటారు" అని తెలిపారు.

ఇదీ జరిగింది!
కఠువా జిల్లాలోని మారుమూల ప్రాంతం మాచేడీలో సోమవారం మధ్యాహ్నం పది మంది జవాన్ల బృందం ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు గ్రనేడ్​తో దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్పరిణామం నుంచి సైనికులు తేరుకోకముందే కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వాహనంలో ఉన్న 10 మందికి కూడా గాయాలయ్యాయి. వారిలో ఐదుగురు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకరు జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన జవాన్లకు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు.

దాడి చేసిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేట- రంగంలోకి NIA- పాక్ కుట్రలపై నిపుణుల హెచ్చరిక

ఉగ్రవాదుల కోసం సైన్యం వేట.. దట్టమైన అడవుల్లో భారీ సెర్చ్‌ ఆపరేషన్

ABOUT THE AUTHOR

...view details