Jammu and Kashmir Assembly Elections 2024 :కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. పీర్ పంజల్ పర్వత శ్రేణికి అటు, ఇటు ఉన్న ఏడు జిల్లాల్లో పదేళ్ల తర్వాత తొలిసారిగా పోలింగ్ జరగనుంది. బుధవారం పోలింగ్ జరగనున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. ఈ 24 అసెంబ్లీ స్థానాల్లో 8 జమ్ము ప్రాంతంలోను, 16 కశ్మీర్ లోయలోనూ ఉన్నాయి. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే.
తొలిదశ పోలింగ్ జరగనున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 3,276 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 14000 మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు. అర్బన్‌లో 302, గ్రామీణ ప్రాంతాల్లో 2974 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థుల్లో CPMకు చెందిన మహ్మద్ యూసుఫ్ తరిగామి, AICC ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సకీనా ఇటూ, PDPకి చెందిన సర్తాజ్ మద్నీ, అబ్దుల్ రెహ్మాన్ ఉన్నారు. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న వేళ జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ), పీపుల్స్ కాన్ఫరెన్స్(పీసీ), జమ్ముకశ్మీర్ పీపుల్స్ మూమెంట్(జేకేపీఎమ్), ఆప్నీ పార్టీతో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎన్నికల బరిలో దిగాయి. కాంగ్రెస్, ఎన్సీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా ఎన్సీ 51 సీట్లలో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.