Jamili Elections Committee Report : జమిలి ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. ఇందుకోసం రాజ్యాంగంలో పలు సవరణలు చేయాల్సి ఉంటుందని వాటిలో చాలా వరకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని పేర్కొంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ గురువారం తమ నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. కోవింద్ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాశ్ కశ్యప్ సహా ఇతర ప్యానెల్ సభ్యులు ఉన్నారు.
హంగ్ హౌస్, అవిశ్వాస తీర్మానం వంటివి ఉంటే మిగిలిన ఐదేళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ తెలిపింది. మొదటి ఏకకాల ఎన్నికల కోసం, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం తదుపరి లోక్‌సభ ఎన్నికల వరకు ముగియవచ్చని ప్యానెల్ స్పష్టం చేసింది. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే అవసరమైన పరికరాలు, సిబ్బంది,భద్రతా దళాల కోసం ముందస్తు ప్రణాళికను కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది.
లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి సింగిల్ ఎలక్టోరల్ రోల్, ఓటర్ ఐడీ కార్డ్‌లను EC సిద్ధం చేయాల్సి ఉంటుందని కోవింద్ కమిటీ పేర్కొంది. ఓటర్లలో పారదర్శకత, చేరిక, సౌలభ్యం, విశ్వాసాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్యానెల్ సూచించింది. అభివృద్ధి ప్రక్రియ, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, ప్రజాస్వామ్య పునాదులను మరింత లోతుగా చేయడానికి ఏకకాల ఎన్నికలు దోహదం చేస్తాయని ప్యానెల్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది.
దాదాపు 191 రోజుల పాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై కోవింద్ కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో 32 జమిలికి మద్దతిచ్చాయి. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా 21,558 స్పందనలు వచ్చాయి. వీరిలో 80శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది.
కమిటీ సిఫార్సులపై కాంగ్రెస్ ఫైర్
మరోవైపు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలకు సిఫారసు చేయడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. "వన్ నేషన్ - నో ఎలక్షన్ " అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేయాలని బీజేపీ కోరుకుంటోందని హస్తం పార్టీ ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీ, 400 సీట్లను ఇవ్వాలని, ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరుతున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ గుర్తుచేశారు. అందులో భాగంగానే కోవింద్ ప్యానెల్ నివేదిక బయటకు వచ్చిందని ఆరోపించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, అసలు ఎన్నికలు లేకుండా చేయాలనేది ప్రధాని ఉద్దేశమని రమేష్ విమర్శించారు.