Rajasthan Fire Accident : రాజస్థాన్‌లో కెమికల్స్‌తో నిండి ఉన్న ట్రక్కు మరికొన్ని వాహనాలను ఢీకొట్టడం వల్ల ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 37 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మంటల్లో దాదాపు 30 ట్రక్కులు, మరికొన్ని ఇతర వాహనాలు దగ్ధమైనట్లు పేర్కొన్నారు. జయపుర- అజ్మేర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిందీ దుర్ఘటన.
25 అంబులెన్స్‌ల్లో బాధితులు తరలింపు
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. 25కు పైగా అంబులెన్స్‌లలో బాధితులను ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో జయపుర- అజ్మీర్ నేషనల్ హైవేపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై 300మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
క్షతగాత్రులకు పరామర్శించిన సీఎం
ప్రమాదంలో గాయపడి ఎస్ఎంఎస్ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని, అగ్నిప్రమాదానికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
'ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డా'
అంతకుముందు ట్రక్కు ప్రమాద ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. "జయపుర-అజ్మీర్ జాతీయ రహదారిపై జరిగిన గ్యాస్ ట్యాంకర్ అగ్నిప్రమాదం వార్త విని చాలా బాధపడ్డాను. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఎస్ఎంఎస్ ఆసుపత్రికి వెళ్లాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించాను. మృతుల కుటుంబాలకు బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఇవ్వాలి. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.