తెలంగాణ

telangana

'ఇవన్నీ మోదీ మీడియా పోల్స్​- ఇండియాకు 295 సీట్లు పక్కా'- ఎగ్జిట్​ పోల్స్​పై కాంగ్రెస్​ - lok sabha election 2024

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 3:45 PM IST

Congress On Exit Polls : లోక్​సభ ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను బూటకంగా అభివర్ణించింది ప్రతిపక్ష కాంగ్రెస్​. ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యకర్తల మనోధైర్యాన్ని తగ్గించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆడుతున్న మైండ్ గేమ్​లో ఇది భాగమని ఆరోపించింది.

lok sabha election 2024
lok sabha election 2024 (ANI)

Congress On Exit Polls :దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గాలి వీస్తోందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఎగ్జిట్ పోల్స్ బూటకమన్న హస్తం పార్టీ, ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యకర్తల మనోధైర్యాన్ని తగ్గించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆడుతున్న మైండ్ గేమ్​లో ఇది భాగమని ఆరోపించింది. ఎగ్జిట్‌ పోల్స్‌పై అగ్ర నేత రాహుల్‌గాంధీ కూడా పెదవి విరిచారు. అవి ఎగ్జిట్‌ పోల్స్‌ కాదని, మోదీ మీడియా పోల్స్‌ అని విమర్శించారు. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ కేవలం కల్పితమని మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు రాహుల్‌ గాంధీ, సిద్ధూ మూసేవాలా పాట 295 విన్నారా అని ఎదురు ప్రశ్నించారు.

'ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బోగస్'
ప్రధాని మోదీ ఒత్తిడి వ్యూహాలు అమలు చేస్తున్నారని, మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. తాను తిరిగి వస్తున్నానని, మళ్లీ ప్రధానిని తానేనని మోదీ దేశ పరిపాలనా వ్యవస్థకు ఒక సంకేతం పంపుతున్నారని విమర్శించారు. ఇలాంటి ఒత్తిళ్లకు బెదరబోమన్న ఆయన, ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బోగస్ అని ఆరోపించారు.

"ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆడుతున్న మైండ్ గేమ్​లో భాగం. ఎగ్జిట్​ పోల్స్​తో ఎలాంటి సంబంధం లేకుండా ఫలితాలు వస్తాయి. శనివారం కూటమిలోని పార్టీలు సమావేశమై చర్చించాయి. మా అంచనాల ప్రకారం ఇండియా కూటమికి సుమారు 295 సీట్లకు తగ్గకుండా వస్తాయి. 2004లో వచ్చిన ఫలితాలే 2024లోనూ పునరావృతం అవుతాయి. అప్పుడు కూడా ఎగ్జిట్​ పోల్స్​ వాజ్​పేయీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీని ఇచ్చాయి. కానీ కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఇలానే జరగబోతుంది."

--జైరాం రమేశ్​, కాంగ్రెస్​ నేత

అభ్యర్థులు, పీసీసీ అధ్యక్షులతో ఖర్గే, రాహుల్​ సమావేశం
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి అక్రమాలు జరగకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ సూచించింది. పార్టీ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు, రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్‌ సహా సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూన్‌ 4 ఓట్ల లెక్కింపు విషయంలో పార్టీ సన్నద్దతపై నేతలు సమీక్షించారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రి అవుతారని ఎగ్జిట్ పోల్స్‌ చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఎగ్జిట్ పోల్స్‌ను బోగస్‌గా కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమిదే విజయమని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

ఈసీని కలవనున్న ఇండియా కూటమి
మరోవైపు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది ప్రతిపక్ష ఇండియా కూటమి. కౌంటింగ్​ నిబంధనలను సరిగ్గా పాటించేలా ఈసీని కోరనున్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి. అంతకుముందు అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను తొలిసారి ఏఆర్‌ఓ టేబుల్స్‌ వద్దకు అనుమతించడం లేదంటూ కాంగ్రెస్​ ఆరోపించింది. తాను అనేక ఎన్నికలను చూశానని, ఇలా జరగడం ఇదే తొలిసారని కాంగ్రెస్ నేత అజయ్​ మాకెన్​ అన్నారు. ఇదే నిజమైతే ఈవీఎంల రిగ్గింగ్‌ కన్నా పెద్దదని ఆరోపించారు. దీనిపై స్పందించిన దిల్లీ ఎన్నికల సంఘం, అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను ఆర్‌ఓ, ఏఆర్‌ఓల టేబుళ్ల వద్దకు అనుమతించామని వెల్లడించింది.

ఇండియా కూటమి నేతల సమావేశం- ఎగ్జిట్​ పోల్స్​ చర్చల్లో పాల్గొనాలని నిర్ణయం - Lok Sabha Election 2024

లోక్​సభ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​- మూడోసారి మోదీయే! అన్ని సర్వేల్లో బీజేపీకే మెజార్టీ స్థానాలు!! - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details