Simultaneous Polls JPC meeting : జమిలి ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కమిటీ తొలి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో జమిలి బిల్లును దేశ ప్రయోజనాలకు సంబంధించినది అని బీజేపీ సభ్యులు ప్రతిపాదించగా, ప్రతిపక్ష ఎంపీలు వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అవుతుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం మొత్తం 39మంది ఎంపీలతో ఈ జేపీసీని ఏర్పాటు చేసింది. బీజేపీ ఎంపీ, జేపీసీ ఛైర్మన్ పీపీ చౌదరి ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రారంభమైంది. చట్టం, న్యాయమంత్రిత్వశాఖ అధికారులు చట్టాలకు సంబంధించిన నిబంధనలను ప్యానల్ సభ్యులకు తెలియజేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంకగాంధీ , శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏక్నాథ్ శిందే, టీఎంసీ నుంచి కల్యాణ్ బెనర్జీతో సహా అన్ని ప్రధాన పార్టీల సభ్యులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున జేపీసీ పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో 39 మంది ఎంపీలతో ఏర్పాటైన జేపీసీ కమిటీ ఈ బిల్లును అధ్యయనం చేయనుంది. దీనిలో లోక్సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది ఉంటారని ప్రభుత్వం నిర్ణయించింది.