Irular Snake Catchers: సాధారణంగా పామును చూస్తే చాలా మంది ఆమడ దూరం పరుగెడుతారు. అది విషం ఉన్న సర్పమైనా, విషంలేని పామైనా దేనిని చూసినా భయంతో వణికి పోతుంటారు ప్రజలు. అయితే తమిళనాడులోని ఇరులర్ గిరిజన తెగకు చెందిన ప్రజలకు మాత్రం ఆ పాములే జీవితాధారంగా మారాయి. విషపూరితమైన పాములను పట్టుకుని వాటి నుంచి విషం సేకరిస్తున్నారు. సొసైటీగా ఏర్పడి సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తున్నారు.
పాము విషాన్ని సేకరించడం కోసం వాడనెమిలిలో ఇరులర్ స్నేక్ క్యాచర్స్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్‌ను తమిళనాడు ప్రభుత్వం 1978లో స్థాపించింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఈ సొసైటీ నడుస్తోంది. తమిళనాడు ప్రభుత్వ కార్మిక సంక్షేమ శాఖ అధికారి ఈ సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా ఉంటారు. ఈ సొసైటీ స్నేక్ ఫామ్‌ను నడుపుతోంది. జులై- మార్చి వరకు గిరిజనులు పాములను పట్టుకుని స్నేక్ ఫామ్‌కు అప్పగిస్తారు. అక్కడే పాముల నుంచి విషాన్ని తీస్తారు.
రూ. కోట్లలో ఆదాయం
ఇలా పాముల నుంచి తీసిన విషాన్ని దేశంలోని వివిధ ఔషధ కంపెనీలకు విక్రయిస్తారు. గత 3ఏళ్లలో 1807.150 గ్రాముల విషాన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీకి రూ.5.43 కోట్లకు విక్రయించారు. ఇందులో వాడనెమిలి స్నేక్ ఫార్మింగ్ అసోసియేషన్ నికర లాభం రూ.2.36 కోట్లుగా ఉంది.