Ink For Lok Sabha Election : లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటరు వేలిపై వేసే సిరాను కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన మైలాక్ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఈ ఎన్నికల కోసం 10 మిల్లీ లీటర్లు కలిగిన 26.55 లక్షల బాటిళ్లను సరఫరా చేయనున్నట్లు మైలాక్ కంపెనీ తెలిపింది. మార్చి 15వ తేదీలోపు అన్ని రాష్ట్రాలకు ఈ సిరాను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కంపెనీ ఎండీ మహ్మద్ ఇర్ఫాన్ పేర్కొన్నారు.
ఒక 10 మి.లీ బాటిల్ 700 మంది ఓటర్లకు సరిపోతుందని కంపెనీ ఎండీ ఇర్ఫాన్ తెలిపారు. ఈ 26.55 లక్షల బాటిళ్ల ద్వారా సుమారు రూ.55 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు ఇప్పటికే సరఫరా మొదలుపెట్టామని, చివరి దశలో ఉందని తెలిపారు. మార్చి 28లోపు సిరా బాటిళ్ల సరఫరా చేయాలని ఎన్నికల సంఘం(ఈసీ) గడువు ఇచ్చిందని వెల్లడించారు.
సిరాను ఉత్పత్తి చేసే ఏకైక సంస్థ
ఎన్నికలు జరిగే సమయంలో ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటు వేయకుండా గుర్తించడానికి చేతికి సిరా చుక్కను పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన నాటి నుంచి ఈ సంస్థే సిరాను ఉత్పత్తి చేస్తుంది. సిరా ఉత్పత్తి చేసే ఏకైక సంస్థ మన దేశంలో ఇదే. ఈ కంపెనీ నిర్వహణ బాధ్యతలను కర్ణాటక ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ కంపెనీని మైసూర్ మహారాజు నల్వాడి కృష్ణరాజ వడయార్ 1937లో ప్రారంభించారు. పెయింట్స్, సంబంధిత ఉత్పత్తుల తయారీ కోసం మైసూర్ లాక్ అండ్ పెయింట్స్ లిమిటెడ్‌గా ఈ సంస్థను మొదలుపెట్టారు.