Infertility Crisis In India :వంధ్యత్వ(Infertility) సంక్షోభం దిశగా భారత్ వెళ్తోందని మన దేశంలోని అతిపెద్ద ఫెర్టిలిటీ ఛైన్ 'ఇందిరా ఐవీఎఫ్' వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ ముర్దియా హెచ్చరించారు. ఇది అత్యంత ఆందోళనకర అంశమని ఆయన చెప్పారు. రాబోయే కొన్నేళ్లలో వంధ్యత్వ సంక్షోభం ప్రభావంతో మన దేశ జనాభా సమీకరణాలు పూర్తిగా మారిపోతాయన్నారు. ఫలితంగా సామాజికంగా, ఆర్థికంగా ప్రతికూల ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని డాక్టర్ అజయ్ ముర్దియా పేర్కొన్నారు. జులై 25న ప్రపంచ కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్) దినం సందర్భంగా పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
'ప్రభుత్వం రంగంలోకి దిగాలి'
హార్మోన్ల సమస్యలు, పెరుగుతున్న ఔషధాల వినియోగం, మారుతున్న జీవనశైలి కారణంగా భారత్‌లో యువతను వంధ్యత్వ ముప్పు అలుముకుంటోందని డాక్టర్ అజయ్ ముర్దియా తెలిపారు. ఫలితంగా ఎంతో మంది సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఐవీఎఫ్ చికిత్స చేయించుకొని సంతానం పొందుతున్నారని పేర్కొన్నారు.
"ఇప్పుడు మన దేశంలో యువత జనాభా అత్యధికంగా ఉంది. వంధ్యత్వ సంక్షోభం మరింత విస్తరిస్తే దేశంలో జనాభా పెరుగుదల రేటు తగ్గిపోతుంది. ఫలితంగా భవిష్యత్తులో మనదేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోతుంది. ఇప్పటికే కొన్ని ఆసియా దేశాలు ఈ తరహా సవాల్‌ను ఎదుర్కొంటున్నాయి" అని డాక్టర్ అజయ్ ముర్దియా వివరించారు.
ఈ పరిస్థితి రాకూడదంటే భారత ప్రభుత్వం ఉచితంగా లేదా రాయితీపై దేశ ప్రజలకు ఐవీఎఫ్ చికిత్సను పొందే సదుపాయాన్ని కల్పించాలని అజయ్ ముర్దియా అన్నారు. ప్రభుత్వ మెటర్నిటీ వైద్య నిపుణులకు ఐవీఎఫ్ చికిత్సా పద్ధతులపైనా శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులలోనూ ఐవీఎఫ్ చికిత్సా యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వాలు చొరవచూపితే మంచిదని సూచించారు.