UTS App Train General Ticket Booking Limit Removed : దేశంలో నిత్యం లక్షల మంది ప్రజలు తమ గమ్యస్థానాన్ని చేరుకోవటానికి రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సమయం ఆదా, తక్కువ ఖర్చు వంటి కారణాలేమైనా ఎక్కువ మంది ట్రైన్ జర్నీని ఇష్టపడుతుంటారు. అయితే, సాధారణంగా ట్రైన్ జర్నీ చేసేవారు.. ఫస్ట్, ఏసీ, సెకండ్ క్లాస్ బోగీల్లో బెర్త్ బుక్ చేసుకోవాలంటే కొన్ని రోజుల ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జనరల్ టికెట్.. తీసుకోవాలంటే మాత్రం రైల్వే స్టేషన్‌కి వెళ్లి క్యూలో నిల్చోని టికెట్ తీసుకోవాలి. అయితే, ఒక్కోసారి కౌంటర్ వద్ద రద్దీ వల్ల ప్రయాణికులకు టికెట్ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి.
దాంతో.. కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టంగా మారుతుంది. ప్రధానంగా వేసవి సెలవులు, పండగ సమయంలో కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. దీంతో రైల్వేశాఖ ప్రయాణికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని గతంలోనే యూటీఎస్(అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్)యాప్‌ను తీసుకువచ్చింది.
ఈ యాప్ ద్వారా రైల్వే బుకింగ్ కేంద్రాల వద్ద బారులు తీరకుండా మొబైల్లోనే ఈజీగా జనరల్ టికెట్లు తీసుకునే వీలును కల్పించింది రైల్వే శాఖ. అయితే.. ఈ అవకాశం రైల్వేస్టేషన్‌కు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదని, జనరల్ టికెట్ బుకింగ్ విషయంలో ప్రయాణికులకు ఇంకా పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించిన రైల్వేశాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.