IMA Letter To Modi : బంగాల్ కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా భారత వైద్య సంఘం పిలుపు మేరకు వైద్యులు సమ్మె చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఐఎంఏ ఓ లేఖ రాసింది. భారతీయ వైద్యుల్లో 60 శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపింది. ప్రస్తుత వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కేవలం మహిళా వైద్యులకే కాకుండా పనిచేస్తున్న మహిళలందరికీ ఆత్మవిశ్వాసాన్ని చేకూర్చుతుందని పేర్కొంది.
"జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన వైద్యరంగాన్ని, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో రెండు అంశాలు వెలుగుచూశాయి. ఒకటి మహిళలకు సురక్షితమైన విశ్రాంతి సౌకర్యాలు లేకపోవడం, రెండు సరైన భద్రతా ప్రొటోకాల్స్ లేని కారణంగా వల్ల దాడులు జరగడం. వృత్తిస్వభావం రీత్యా వైద్యులు ముఖ్యంగా మహిళా సిబ్బంది హింసకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో సరైన భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది" అని ఐఎంఏ తన లేఖలో పేర్కొంది. అదే సమయంలో పలు డిమాండ్లను కూడా ప్రస్తావించింది.
- వైద్యసేవలు, ఆస్పత్రులకు సంబంధించిన చట్టాలను పటిష్ఠం చేయాలి.
- ఆస్పత్రుల్లోనూ విమానాశ్రయాల మాదిరి భద్రతా ప్రొటోకాల్స్ అమలు చేయాలి. వాటిని సేఫ్‌జోన్‌లుగా ప్రకటించాలి.
- వైద్యుల పని ప్రదేశంలో పరిస్థితులను మార్చాలి. తగినన్ని విశ్రాంతి గదులు అందుబాటులో ఉంచాలి.
- నేరాల విషయంలో పకడ్బందీ దర్యాప్తు జరపాలి. నిర్ణీత కాలవ్యవధిలో న్యాయం అందించాలి.
- బాధిత కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం అందించాలి.