Rahul Gandhi On Budget :దేశంలో భయానక వాతావరణం నెలకొందని, BJP చక్రవ్యూహాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించారని ఆరోపించారు. దేశంలో BJP 'చక్రవ్యూహం' ద్వారా భయం వ్యాపిస్తోందని, అందులో రైతులు, కార్మికులతో సహా ఆ పార్టీ MPలు చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. 2024-25 కేంద్ర బడ్జెట్‌పై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వేలాది ఏళ్ల క్రితం హరియాణాలోని కురుక్షేత్రలో అభిమన్యుడిని చక్రవ్యూహంలో చిక్కుకునేలా చేసి ఆరుగురు ప్రాణాలు తీశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చక్రవ్యూహాన్ని నిర్మిస్తే కుల గణనను చేపట్టడం ద్వారా దాన్ని విపక్ష కూటమి విచ్ఛిన్నం చేస్తుందని చెప్పారు.
"అభిమన్యుడిని చక్రవ్యూహంలో బంధించి ఆరుగురు చంపారు. చక్రవ్యూహం గురించి నేను పరిశోధన చేశాను. నాకు దాన్ని పద్మవ్యూహం కూడా అంటారని తెలిసింది. చక్రవ్యూహం కమలం పువ్వు రూపంలో ఉంటుంది. 21వ శతాబ్దంలో కొత్త చక్రవ్యూహం తయారైంది. అది కూడా కమలం పువ్వు గుర్తులానే ఉంటుంది. ప్రధాని మోదీ తన ఛాతిపై ఆ చిహ్నాన్ని ధరిస్తారు. అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఏం చేశారో, దేశాన్ని అదే చేశారు. దేశంలోని యువకులు, రైతులు, తల్లులు, సోదరీమణులు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలతో అదే చేశారు. ఈ రోజు కూడా చక్రవ్యూహంలో ఆరుగురే ఉన్నారు. చక్రవ్యూహంలో వేలాది మంది ఉంటారు. కానీ దాని మధ్యలో ఉన్న ఆరుగురు నియంత్రిస్తారు."