How To Make Military Mutton Curry Recipe :నాన్‌వెజ్‌లో ఎన్ని రకాలున్నా.. మటన్ లెక్కే వేరు. ఆ టేస్టే వేరు. అయితే.. చాలా మంది ఇంట్లోకి మటన్ ఎప్పుడు తీసుకొచ్చినా.. రెగ్యులర్ కర్రీ చేసుకుంటారు. అందుకే.. ఈసారి మిలిటరీ స్టైల్లో మటన్ కర్రీ చేసేయండి. ఇప్పటి వరకూ తినని సరికొత్త మటన్ కర్రీని రుచి చూస్తారు. మిలిటరీ స్టైల్ మటన్ కర్రీ చేయడం అంటే.. దానికి చాలా పెద్ద తతంగం ఉంటుందని అనుకుంటారు చాలా మంది. కానీ.. చాలా సింపుల్‌గా ఈ రెసిపీని తయారు చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మిలిటరీ స్టైల్ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో.. ఏమేం పదార్థాలు కావాలో.. తయారీ విధానం ఏంటో.. చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మటన్ - అర కేజీ
- వెల్లుల్లి రెబ్బలు - 8
- పచ్చిమిర్చి - 8
- పెరుగు - కప్పు
- అల్లం - చిన్న ముక్క
- పసుపు - టీస్పూన్
- ఉల్లిపాయలు - 3
- జీలకర్ర - టీస్పూన్
- కారం - 2 టేబుల్ స్పూన్
- గరం మసాలా-టేబుల్ స్పూన్
- నూనె- మూడు టేబుల్‌స్పూన్లు
- దాల్చిన చెక్క - చిన్నది
- ఏలకులు-4
- లవంగాలు - 3
- మిరియాలు - 8
- బిర్యానీ ఆకులు- 2
- వాటర్ - సరిపడా
- ఉప్పు - సరిపడా
- కొత్తిమీర - కప్పు
- పుదీనా - కొద్దిగా
- పచ్చిమిర్చి - 5 (పేస్ట్ కోసం)
- నెయ్యి - రెండు టీ-స్పూన్లు
మిలటరీ మటన్ కర్రీ తయారీ విధానం :
- ముందుగా మటన్‌ను రెండు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
- ఈ కర్రీ రుచిగా ఉండాలంటే.. ఇందులో కలిపే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకోవాలి.
- అలాగే మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చీ వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు గిన్నెలో మటన్ వేసి.. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి మిశ్రమం, పెరుగు, పసుపు, కారం, గరం మసాలా, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. దీనిని గంట సేపు పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు మరొక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని.. దాల్చిన చెక్క, జీలకర్ర, ఏలకులు, మిరియాలు, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు వేసి వేయించండి.
- ఉల్లిపాయలు వేగిన తర్వాత మారినేట్ చేసుకున్న మటన్ వేసి 5 నిమిషాలు ఉడికించండి.
- తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసి మూత పెట్టి.. మరొక 20 నిమిషాలు కుక్ చేయండి.
- మటన్ మెత్తగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరొక 5 నిమిషాలు ఉడికించండి.
- తర్వాత కొద్దిగా నెయ్యి, పుదీనా, కొత్తిమీర చల్లుకుని దించుకుంటే సరిపోతుంది.
- ఇలా సింపుల్‌గా చేస్తే వేడి వేడి మిలిటరీ మటన్ కర్రీ రెడీ.
- దీనిని వేడివేడి అన్నంలోకి, అలాగే రోటిలు, పుల్కాలతో కలిపి తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈ సండే రోజు మీరూ ట్రై చేయండి.