Himachal Pradesh Politics Today :హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో ఆర్థిక బిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ విప్‌ను ధిక్కరించిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్ భూటూ, రవి ఠాకూర్ , చెతన్య శర్మగా స్పీకర్ వెల్లడించారు.
తక్షణమే అమల్లోకి!
ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసిన స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా- హస్తం పార్టీ గుర్తుపై ఎన్నికైనందున ఈ శాసనసభ్యులు కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని శిమ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. స్పీకర్ నిర్ణయం తర్వాత ఈ ఎమ్మెల్యేలందరూ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.