Heavy Rains in Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న జోరు వాన ముంబయి మహానగరాన్ని ముంచెత్తింది. రోడ్లు, రైల్వే మార్గాలు జలమయమయ్యాయి. ఫలితంగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
పలు రైళ్లు రద్దు
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మిమి, పోవాయ్‌లో 314 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపారు. వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడం వల్ల చాలా లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను కూడా అధికారులు నిలిపివేశారు.
సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్
ఈ వర్షాలు కారణంగా ముంబయులోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంధేరి, కుర్లా, భందూప్, కింగ్స్ సర్కిల్, దాదర్‌తోపాటు పలు ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. రహదారులపై మోకాలి లోతు నీరు రావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కార్లు, మోటారు సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి. అటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం కూడా ముంబయిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ముంబయితో పాటు ఠాణె, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్‌కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.